'ఎవరక్కడ' అంటే.. 'యెస్ బాస్' అనేవారే లేరట
By అంజి Published on 5 Feb 2020 3:44 AM GMTతెలంగాణా పోలీసు విభాగంలో ఉండాల్సిన సిబ్బంది కన్నా 35 శాతం తక్కువగా ఉన్నారు. బ్యూరో ఆఫ్ పోలీసు రిసర్చి అండ్ డెవలప్ మెంట్ వారి గణాంకాల ప్రకారం తెలంగాణలో 3.50 కోట్ల మంది ప్రజలకు గాను కేవలం 53115 మంది పోలీసులు మాత్రమే ఉన్నారట. ప్రతి లక్షమంది జనాభాకి 428.11 మంది పోలీసులు ఉండాలని మంజూరీలు ఉన్నప్పటికీ ప్రస్తుతం కేవలం లక్షమందికి 233.3 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. తెలంగాణకు మంజూరు అయిన పోలీసు ఉద్యోగాల సంఖ్య 81647 కాగా ప్రస్తుతం 53115 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే మిగతా వన్నీ ఖాళీలే. ఈ ఖాళీలను భర్తీ చేసే దిశగా పెద్దగా ప్రయత్నాలేవీ జరగడం లేదు. ఇవన్నీ జనవరి 2019 నాటి లెక్కలు. తెలంగాణలో ప్రతి వంద చదరపు కిలో మీటర్లకు 72.93 మంది పోలీసులు ఉన్నారు. అంటే ఒక పోలీసు 1.37 చ.కిమీ. భూభాగానికి బాధ్యుడన్న మాట.
అయితే తెలంగాణ పోలీసులో మంజూరైన ఉన్నతాధికారుల పోస్టుల కన్నా ఎక్కువ సంఖ్యలో బాస్ లు లేదా పోలీసు భాషలో చెప్పాలంటే “దొరవార్లు” ఉన్నారు. తెలంగాణలో ఇద్దరు డైరెక్టర్ జనరల్ హోదా అధికారులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఆరుగురు ఉన్నారు. ఆరుగురు అడిషనల్ డీజీలు ఉండాలి. కానీ పన్నెండు మంది ఉన్నారు. పదహారుగురు ఐజీలు ఉండాలి. కానీ ఉన్నది 27. వీళ్లంతా “ఎవరక్కడ” అని గదమాయించే బాసులు. కానీ పనిచేసే వారు, రంగంలో దూకేవారు, లా అండ్ ఆర్డర్ ను కాపాడేవారు మాత్రం తక్కువగా ఉన్నారు.
ఉదాహరణకు ఎస్ పీ స్థాయిలో 83 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం కేవలం 66 మందే ఉన్నారు. అడిషనల్ ఎస్ పీలు 92 మంది ఉండాలి. కానీ ఉన్నది కేవలం 86 మందే. 312 మంది అసిస్టెంట్ ఎస్ పీలు ఉండాల్సి ఉండగా ఉన్నది మాత్రం 305 మంది మాత్రమే. 934 మంది సీఐలు ఉండాలి. కానీ ఉన్నది మాత్రం 923. అందుకే పోలీస్ శాఖలో “ఎవరక్కడ” అంటే “యెస్ బాస్” అనేవారే లేరట.