స్వరాష్ట్రం కోసం సాగించిన దశాబ్దాల పోరాటం

By సుభాష్  Published on  1 Jun 2020 11:30 PM GMT
స్వరాష్ట్రం కోసం సాగించిన దశాబ్దాల పోరాటం

ముఖ్యాంశాలు

  • నవ తెలంగాణ శకం’ వాస్తవరూపం దాల్చిన అపురూప సందర్భం

  • తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం ఆవిష్కరించిన తేదీ

  • ఈ విజయం వెనుక లక్షల మంది కష్టనష్టాలున్నాయి

  • ఈ విజయం వెనుక వెయ్యికి పైగా బలిదానాలున్నాయి

స్వరాష్ట్రం కోసం సాగించిన దశాబ్దాల పోరాటం! సొంత పాలనకు తెలంగాణ ప్రజ పరవశించిపోయింది! జూన్ 2.. తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం ఆవిష్కరించిన తేదీ! ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న ‘నవ తెలంగాణ శకం’ వాస్తవరూపం దాల్చిన అపురూప సందర్భం! ఇది.. తెలంగాణ మళ్లీ పుట్టిన చారిత్రక ఘట్టం!

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. చరిత్రాత్మక సందర్భం. మహత్తరమైన శుభవేళ. దాస్య శృంఖలాలను శాశ్వతంగా తెంచుకొని తన అస్తిత్వాన్ని నిలుపుకొన్న తరుణం. గత ఐదేండ్లలో, అన్నిరంగాలలో సాధించిన ఘన విజయాలతో గర్వపడుతూ, తలెత్తి తెలంగాణ రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తులో అడుగుపెడుతోంది. ఈశుభవేళ కోసం తెలంగాణ ప్రజలు ఒళ్లంత కళ్లు చేసుకొని, గుండెల నిండా గాయాలు నింపుకొని,.. అగ్ని గుండాలను అధిగమిస్తూ అనేక ఏండ్లు నిరీక్షించారు-నిప్పుల కుంపట్ల ను నెత్తిన ఎత్తుకొని నిరుపమాన పోరాటాలు నిర్వహించారు.

దశాబ్దాల వివక్ష పాలన నుంచి విముక్తి పొంది.. తెలంగాణ సమాజం స్వేచ్ఛను అనుభవిస్తున్న రోజులివి. ఈ విజయం వెనుక వెయ్యికి పైగా బలిదానాలున్నాయి! ఈ విజయం వెనుక లక్షల మంది కష్టనష్టాలున్నాయి! గోసలున్నాయి.. లాఠీ దెబ్బలే తిన్నారో.. కరుకుబూట్ల కర్కశత్వాన్నే చూశారో.. ఈసడింపులు.. అవమానాలు.. ఇంకెన్నెన్ని భరించారో..! ఇవన్నింటినీ భరించి తెలంగాణ రాష్ట్ర అవతరణం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఊరు, వాడల ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు సన్నాహాలు చేస్తోంది.

కొత్త గొంతుక.. నూతన అస్తిత్వం మొదలై ఐదు వసంతాలు. మహోద్యమం స్థానంలో మొలచిన ఆశల రెక్కలు. ఆకాశం ఎత్తున అంచనాలు. అలల్లా దూసుకొచ్చే కొత్త డిమాండ్లు. అన్నిటినీ నిభాయించుకుని పరిపాలన రథాన్ని గాడిలో పెట్టడం ఒక అద్భుతం. నిత్యచైతన్య స్రవంతిలా ప్రవహించే ఉద్యమాల పురుటిగడ్డ తెలంగాణలో.. శాంతిభద్రతల పరిరక్షణ కత్తిమీద సామే. వీటన్నిటినీ నెగ్గుకుని రాగలిగింది కాబట్టే తెలంగాణ నేడు ఒక ఫలవంతమైన రాష్ట్రంగా నిలిచింది.

కొత్త రాష్ట్రంలో ఉద్యోగుల పంపకాలు మొదలు ఆస్తుల విభజన వరకూ అన్నీ సమస్యలే. వాటన్నిటినీ ఒక్కటొక్కటిగా పరిష్కరించుకుంటూ నిలదొక్కుకోగలిగింది. సంక్షేమ పథకాల అమలు విషయంలో కేసీఆర్ రికార్డు సృష్టించారు. పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం మొదలు పింఛన్ల వరకూ అన్నిటా కొత్త ఒరవడి. ప్రతి ఇంటికీ ఏదో ఒక సర్కారు పథకం లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో.. సంక్షేమ పథకాలను సంతృప్తస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

టీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో.. ముఖ్యంగా రైతుబంధు పథకం వ్యవసాయరంగానికి నూతన దిశానిర్దేశం చేసింది. ఇతర రాష్ట్రాలు సైతం ఈ పథకం అమలుకు సంబంధించి అధ్యయనం చేయకతప్పని అనివార్యతను తెలంగాణ కల్పించింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సాధికారత కల్పించే అంశాలు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులూ నీటి కడగండ్లకు శాశ్వత పరిష్కారం సూచించే దిశలో రూపకల్పన చేసినవే.

అటు ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాల్లో అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలిచింది. విద్య, వైద్య రంగాల్లో సైతం స్వరాష్ట్రం వచ్చిన తర్వాత రికార్డు స్థాయి మెరుగుదల సాధ్యమైంది. పాలనాపరంగా అవాంతరాలను ఎదర్కొని.. భావోద్వేగాల బంగారు తెలంగాణ తనను తాను తీర్చిదిద్దుకుంటూ బులిబులి అడుగులతో మురిపిస్తోంది.

Next Story