తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణలో కఠినంగా వ్యవహరించనుంది. నిర్లక్ష్యంగా ఎవరైన రోడ్లపై చెత్తవేస్తే రూ. 500 జరిమానా విధించాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అధికారులను ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రంగా ఉండటంతో భౌతిక దూరం పాటించడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులు రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు. అంతేకాకుండా గ్రామాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అంతేకాకుండా పల్లెప్రగతి స్ఫూర్తితో జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకూ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని స్పష్టం చేశారు. మొదటి రోజుల్లో భాగంగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, అధికారులు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహిస్తారని, ఆ సమయంలో నీరు నిలిచిన గుంతలన్నింటిని పూడ్చివేస్తారన్నారు. కాగా, రక్షిత నీటి పథకాలను ప్రతి నెల 1,11,21వ తేదీల్లో శుభ్రపరిచి, లీకేజీలు లేకుండా చూడాలని మంత్రి దయాకర్‌రావు అన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.