ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కీలక వ్యాఖ్యలు చేసిన 'హైకోర్టు'

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Nov 2019 1:46 PM GMT
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.కార్మికులు ఆత్మహల్యు చేసుకోవడానికి ప్రభుత్వమే కారణమని చెప్పడానికి ఆధారాలు ఏంటని ప్రశ్నించింది. కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వమే కారణమని ఆర్టీసీ జేఏసీ చెప్పడానికి ఆధారాలు చూపించండని పేర్కొంది. కార్మికులకు గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని, దానిని అదనుగా చేసుకొని ఆ నిందను సర్కార్‌పై నెట్టడం సరైంది కాదని హితవు పలికింది. కాగా, ప్రభుత్వ తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కార్మికులను డిస్మిస్‌ చేసినట్టు ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొంది. ప్రభుత్వ తీరుతోనే కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పలు సూసైడ్‌ నోట్‌లను పిటిషన్‌ న్యాయస్థానం ముందు ఉంచారు. పిటిషనర్‌ వాదనపై స్పందించిన హైకోర్టు సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్‌ నాయకులే దీనికి బాధ్యత వహించాలని వ్యాఖ్యనించింది.

అయితే యూనియన్‌లు సమ్మెకు పిలుపునిస్తే.. కార్మికుల ఆత్మహత్యలకు సర్కార్‌ ఏవిధంగా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించింది కోర్టు. కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ మాట్లాడుతూ.. సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వెళ్లిన పలువురు కార్మికులను పోలీసులు అరెస్ట్‌ చేశారని, ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని.. లేకుంటే మరిన్ని ఆత్మహత్యలు జరిగే అవకాశం ఉందని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పిటిషనర్‌ వాదనపై స్పందించిన న్యాయస్థానం.. కార్మికులను డిపోల్లోకి అనుమతి ఇవ్వకపోతే మరో అఫిడవిట్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Next Story