తెలంగాణ ప్రభుత్వ రిపబ్లిక్ వేడుకలు.. జెండా ఎగరేయడంలో ఆలస్యం
By అంజి Published on 26 Jan 2020 6:44 AM GMTహైదరాబాద్: నగరంలోని పబ్లిక్ గార్డెన్‌లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన 71వ రిపబ్లిక్ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేయడంలో కాస్త ఆలస్యం జరిగింది. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఎన్ని సార్లు రోప్ లాగిన జెండా ఎగరలేదు. దీంతో అధికారులు జెండాను పూర్తిగా కిందకు దించి మళ్లీ ఎగురవేశారు. దీనిపై సీఎం కేసీఆర్, గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ తప్పిదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. అప్పటికే రెండు సార్లు జాతీయ గీతాలపన చేశారు. మరోసారి గవర్నర్ తమిళసై జాతీయ జెండాను ఎగరవేయడంతో అందరూ జాతీయ గీతాన్నిఆలపించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసారి, కేటీఆర్‌తో పలువురు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక పాలన సంస్కరణలు చేపడుతూ సుపరిపాలనను అందిస్తోందని అమె అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను, గ్రామ పంచాయితీలను ప్రభుత్వం పెంచిందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాలు ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోంటోందని, రెవెన్యూ చట్టం ద్వారా పారదర్శక సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు గవర్నర్ తెలిపారు.
చాలా ప్రాంతాల్లో రిపబ్లిక్ వేడుకల్లో అపశృతులు చోటు చేసుకున్నాయి. విశాఖలోని వైసీపీ కార్యాలయంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. వెంటనే మళ్లీ జెండాను సరిచేశారు. నర్సీపట్నం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండగా స్థంభంపై ఉన్న చక్రం విరిగి జాతీయ జెండా కిందపడింది. వెంటనే అధికారులు జెండాను సరిచేశారు.