రంగారెడ్డి: శంషాబాద్‌ మండలంలోని బుర్జుగడ్డ తండా సమీపంలో ఎల్‌పీజీ గ్యాస్‌ ట్యాంకర్‌ బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున అతివేగంతో వెళ్తున్న గ్యాస్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. ట్యాంకర్‌లో నిండుగా గ్యాస్‌ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్‌ వైపు గ్యాస్‌ లోడ్‌తో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ట్యాంకర్‌లో నిండుగా గ్యాస్‌ ఉండడంతో వాహనదారులు ఒక్కసారిగా ఉల్కిపడ్డారు. రోడ్డు మీద గ్యాస్‌ ట్యాంకర్‌ అడ్డంగా బోల్తా పడింది. విషయం తెలుసుకున్న శంషాబాద్‌ రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. బోల్తా పడిన ట్యాంకర్‌ను క్రేన్‌ ద్వారా తొలగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గ్యాస్‌ ట్యాంకర్‌ వద్దకు ఎవరిని వెళ్లనీయకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.