కాల్చి చంపితేనే సరైన న్యాయం..!

By అంజి  Published on  7 Dec 2019 4:54 AM GMT
కాల్చి చంపితేనే సరైన న్యాయం..!

ముఖ్యాంశాలు

  • కొమరం భీమ్ ఆసిఫాబాద్ లో చిరు వ్యాపారిపై అత్యాచారం - హత్య
  • న్యాయం కోరుతున్న బాధితురాలి భర్త
  • దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై హర్షం
  • తమకూ అదే న్యాయం చేయాలని డిమాండ్

శంషాబాద్ సమీపంలో చట్టాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం లింగాపురం మండలం కొమరం భీమ్ ఆసిఫాబాద్ లో ఓ ముప్ఫై ఏళ్ల చిరువ్యాపారిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఉదంతంకూడా ఈ సందర్భంగా వెలుగులోకి వస్తోంది.

హతురాలి భర్త శంషాబాద్ సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ ని స్వాగతించాడు. తన భార్యపై జరిగిన అత్యాచారం, హత్య కేసులోకూడా తమకూ అదే విధంగా న్యాయం చేయాలని బాధితురాలి భర్త కోరుతున్నాడు. తన భార్యను అత్యంత పాశవికంగా మానభంగం చేసి చంపేసిన నిందితులనుకూడా ఎన్ కౌంటర్ చేస్తే తాను ఎంతో సంతోషిస్తానని అతడు తెలిపాడు.

దిశ కేసులో నిందితులను కాల్చిపారేయడంకంటే ముందే తన భార్యను పాశవికంగా హత్యచేసిన నిందితులను కాల్చి చంపితే ఎంతో బాగుండేదని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. మనుషుల మధ్యలోనే తిరుగాడుతూ సాటి మనుషులను దారుణంగా చంపేస్తున్న దుర్మార్గులకు అలాంటి శిక్షే సరైనదని, నిజానికి పోలీసులు అలా చేసి ఉండకపోతే సామాన్యులకు చట్టంపై, న్యాయంపై నమ్మకం పోతుందని అతడు అంటున్నాడు.

సామూహిక అత్యాచారానికి, దారుణ హత్యకు గురైన మహిళ, ఆమె భర్త పొట్టకూటికోసం ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి గ్రామంనుంచి జైనూర్ మండలానికి ఏడేళ్లక్రితం వలసవచ్చారు. ఊహించని రీతిలో తన భార్యపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య తన కుటుంబాన్ని కకావికలం చేసేసిందని బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు.

అనాథలైన పిల్లలు..

భార్య అర్థంతరంగా ప్రాణాలు పోగొట్టుకోవడంతో తనూ తన పిల్లలూ అనాధలైపోయారని విలపిస్తున్నాడు. ఇప్పటికీ తన భార్య దారుణ హత్యకు గురయిందన్న నిజాన్ని తాము నమ్మలేకపోతున్నామని బాధితుడు చెబుతున్నాడు. రెండు వారాల్లోగా తన భార్యపై జరిగిన అత్యాచారం, హత్య కేసులకు సంబంధించి చార్జ్ షీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెప్పినట్టుగా తెలిపాడు.

తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి రూ. 4.12 లక్షల పరిహారాన్ని, తనకు ఉద్యోగాన్ని, తన పిల్లలకు జైనూరు మండలంలోని ప్రభుత్వ రెసిడెన్సియల్ స్కూల్లో ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చిందని బాధితుడు చెప్పాడు.

జైనూరులో జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులోకూడా తెలంగాణ పోలీసులు దిశ హత్యాచారం కేసులో చేసిన న్యాయం చేయాలన్న అభిప్రాయం నెటిజన్లలో విస్తృతంగా వ్యక్తమవుతోంది. నవంబర్ 24వ తేదీ 2019న బాధితురాలు తనపనికోసం తాను వెళ్తుండగా ఈ దారుణం జరిగిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

జైనూరు మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు నిందితులు ఆమెను బలంవంతంగా ఈడ్చుకెళ్లి అత్యాచారం జరిపి, హత్య చేసినట్టుగా కేసు నమోదయ్యింది. బాధితురాలు అరిచి గోలచేస్తోందన్న కోపంతో నిందుతులు అత్యాచారం జరిపే సమయంలో ఆమె నాలుకను కత్తితో చీల్చారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ముగ్గురు నిందితులు జుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు.

Next Story