హుబ్లీలో సజ్జనార్ కుటుంబానికి అభినందనల వెల్లువ..!

By అంజి  Published on  7 Dec 2019 4:18 AM GMT
హుబ్లీలో సజ్జనార్ కుటుంబానికి అభినందనల వెల్లువ..!

ముఖ్యాంశాలు

  • వి.సి.సజ్జనార్ స్వగ్రామం హుబ్లీ
  • కర్నాటకలోని హుబ్లీలోనే సజ్జనార్ విద్యాభ్యాసం
  • ఎం.బి.ఎ తర్వాత సివిల్ సర్వీస్ పరీక్షలపై ఆసక్తి
  • హుబ్లీలో మల్లికార్జున సజ్జనార్ కు డాక్టర్ గా మంచిపేరు
  • సజ్జనార్ కు అభినందనలు తెలిపిన కర్నాటక ముఖ్యమంత్రి

సైబరాబాద్ కమిషనర్, డైనమిక్ ఐపిఎస్ ఆఫీసర్ విశ్వనాథ్ సజ్జనార్ కు ఎన్ కౌంటర్లు కొత్తేమీ కాదు. శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ సమీపంలోని చట్టాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర ఘటనా స్థలంలోనే దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ మళ్లీ మరోసారి సజ్జనార్ ను వార్తల్లోకి తీసుకొచ్చింది.

ఘటనా స్థలంలో క్రైమ్ సాన్ రీ కన్ స్ట్రక్ట్ చేస్తున్న సమయంలో నలుగురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారని, వారిలో ఒకరు పోలీసుల దగ్గర ఉన్న తుపాకీని లాక్కునే ప్రయత్నం చేశారని, నిందితుల పోలీసులపై దాడికి తెగబడడంతో ఎన్ కౌంటర్ తప్పలేదని పోలీస్ టాప్ బాస్ ప్రకటన చేశారు. ఈ ఎన్ కౌంటర్ తో సామాన్యుల్లో సజ్జనార్ కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ మరింతగా పెరిగిపోయాయి.

సజ్జనార్ హుబ్లీ జిల్లాకు చెందినవ్యక్తి. గడగ్ జిల్లాలో వాళ్ల కుటుంబం మూలాలున్నాయి. సజ్జనార్ పెద్దన్నయ్య డాక్టర్ మల్లికార్జున సజ్జనార్ హుబ్లీలో పేరుమోసిన వైద్యులు. శుక్రవారం తెల్లవారు జామున ఎన్ కౌంటర్ లో దిశ కేసులో నలుగురు నిందితులు హతమయ్యారన్న వార్త తెలియగానే హుబ్లీలోని డాక్టర్ మల్లికార్జున్ సజ్జనార్ ఇంటికి బంధుగణం, ఆత్మీయులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దిశ కేసులో సత్వర న్యాయం జరిగిందని భావించేవారందరూ ప్రత్యేకంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నగారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

మల్లికార్జున్ సజ్జనార్ మాత్రం ఎన్ కౌంటర్ గురించి మాట్లాడేందుకు సుముఖత ప్రదర్శించలేదు. తమ నివాసానికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ ఆయన సున్నితమైన సమాధానం చెప్పి పంపించేశారు. చట్టపరమైన విషయాల గురించి మాట్లాడం తనకు ఇష్టం లేదని, వాటిలో తనకు పెద్దగా అనుభవం లేదని అన్నారు. ఒక సగటు భారతీయుడిగా మాత్రం తనకు ఈ పరిణామం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.

తన తమ్ముడు బాధ్యత కలిగిన పోలీస్ అధికారిగా, సమర్ధుడిగా పేరు తెచ్చుకోవడం తనకు సంతోషకరమైన విషయమని మల్లికార్జున్ సజ్జనార్ చెప్పారు. తన సమర్థతమీద నమ్మకంతోనే సైబారాబాద్ పోలీస్ కమిషనర్ పదవిలో నియమించారన్నారు. సజ్జనార్ ఎం.బి.ఎ చేసిన తర్వాత 1996లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు పాసయ్యారు. ఐపీఎస్ అధికారిగా తెలంగాణ కేడర్ లో జాయిన్ అయ్యారు.

హుబ్లీలో పుట్టి పెరిగిన సజ్జనార్‌..

హుబ్లీలో పుట్టి పెరిగిన వి.సి.సజ్జనార్ ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే జరిగింది. లయన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివారు. జె.జి. కాలేజ్ ఆఫ్ కామర్స్ లో బి.కాం చేశారు. తర్వాత కౌశలి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యానేజ్ మెంట్ నుంచి ఎం.బి.ఏ పూర్తి చేశారు. తర్వాత కొంతకాలంపాటు తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నారు. ఆ సమయంలోనే సివిల్ సర్వీస్ పరీక్షలపై మక్కువ ఏర్పడింది. ఆయన ఆసక్తిని గమనించిన కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో ప్రోత్సహించారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహ సహకారాలతో వి.సి.సజ్జనార్ తను ఎంచుకున్న మార్గంలో పయనించడం తేలికయ్యింది. తండ్రి తర్వాత అన్న మల్లికార్జున్ సజ్జనార్ మాటంటే వి.సి.సజ్జనార్ కి ఇప్పటికీ వేదం.

సైబరాబాద్ పోలీసులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అలాంటి స్థితిలో కఠిన నిర్ణయం తీసుకోక తప్పకపోయి ఉండొచ్చనీ, ఆ నిర్ణయాన్ని దేశం యావత్తూ పూర్తి స్థాయిలో సమర్ధిస్తోందనీ, తానుకూడా పూర్తిగా ఆ నిర్ణయంతో ఏకీభవిస్తున్నాననీ కర్నాటక ముఖ్యమంత్రి ఒక ప్రత్యేక ప్రకటనలో తెలియజేయడం విశేషం. అంతే కాకుండా ఆయన సజ్జనార్ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Next Story