భార్యా భర్తలు ఆర్ధిక రహస్యాలు దాచుకుంటే.....?

By Newsmeter.Network  Published on  13 Dec 2019 2:15 PM IST
భార్యా భర్తలు ఆర్ధిక రహస్యాలు దాచుకుంటే.....?

వివాహ బంధానికి నమ్మకమే అసలైన ఆధారం. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నంత వరకూ వారి ప్రేమ ప్రపంచానికి వారే రాజులు, రాణులు. కానీ ఆ నమ్మకం సడిలిపోతే అంతే సంగతులు. పతి, పత్ని మధ్య “వోహ్” ప్రవేశించినా, తనకు తెలియకుండా భార్య మరొకరిని కలుస్తున్నా పొరపొచ్చాలు మొదలవుతాయి. అవి కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్టు పెరిగిపెద్దవౌతాయి. చివరికి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వేరైపోతారు.

అయితే ఇప్పుడు సామాజికవేత్తలు మరో విషయాన్ని కూడా కనుగొన్నారు. అదేమిటంటే ఒకరిమీద ఇంకొకరికి ఎంత ప్రేమ పొంగి పొరలినా ఆర్ధిక విషయాల్లో ఇద్దరి మధ్యా నిజాయితీతో కూడిన వ్యవహారం లేకపోతే చాలా కష్టం. భార్య లేదా భర్త పరస్పరం తమ సంపాదనను దాచి పెట్టినా, తెలియకుండా డబ్బులు ఇతరులకు ఇచ్చినా, లేకపోతే ఏవైనా వస్తువులు కొని దాచిపెట్టినా అది తీవ్రమైన అపనమ్మకానికి దారి తీస్తుంది. మన దగ్గరైతే మాటా మాటా దగ్గర ఆగిపోతుంది కానీ పాశ్చాత్య దేశాల్లోనైతే విడాకుల దాకా పోతుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఇండియానా యూనివర్సిటీ సహా నాలుగు యూనివర్సిటీల్లో జరిపిన పరిశోధనల్లో తేలింది. ఆర్ధిక అంశాలపై అపనమ్మకం కలిగితే వివాహ విచ్ఛిత్తికి దారి తీస్తుందని ప్రధాన పరిశోధకుడు జెన్నీ ఒల్సన్ చెబుతున్నారు. ఆర్ధిక వనరులు సంబంధాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఆయన అంటున్నారు. దీని వల్ల జీవన బాగస్వామి రహస్యాలు దాస్తున్నారన్న అనుమానాలు బలపడతాయని ఆయన చెబుతున్నారు.

ఇందుకోసం ఈ పరిశోధకులు ఫైనాన్సియల్ ఫిడెలిటీ స్కేల్ అనే సూచిని తయారు చేశారు. దాని ఆధారంగా సంబంధాల స్థితిగతులను వారు అంచనా వేశారు. ఆర్ధికంగా బార్యాభర్తల మధ్య అపనమ్మకాలు ఏర్పడితే ప్రణాళికలు దెబ్బతింటాయని, ఉమ్మడి ఆలోచనలకు విఘాతం కలుగుతుందని పరివోధనలో తేలింది.

ఇంతకీ ఈ పరిశోధన మన దేశానికి వర్తిస్తుందా? ఏమో ... మన దేశంలో భార్యలు భర్తకు తెలియకుండా పోపుల పెట్టెలో దాచిపెట్టే డబ్బులే నెలాఖర్లో అక్కరకు వస్తాయి. అదే విధంగా భర్త జేబులోని డబ్బులను భార్య తీసేసుకోవడం , భర్త ఆఫీసునుంచి ఇంటికి వచ్చే సరికి తాను వస్తువులు కొనేసుకుని, భర్తకు చూపించడం వంటివి సర్వసాధారణం. కానీ అవి పెద్దగా విడాకుల దాకా వచ్చిన దాఖలాలు చాలా తక్కువ.

Next Story