'పురపోరు'.. గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అడుగులు..!

By Newsmeter.Network  Published on  13 Jan 2020 6:57 AM GMT
పురపోరు.. గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అడుగులు..!

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ముందకెళ్తోంది. రాష్ట్రంలోని అన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ గెలుపు తథ్యమని సీఎం కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. 10 కార్పొరేషన్లలో విజయఢంకా మోగించేందుకు టీఆర్‌ఎస్‌ మరింత దూకుడు పెంచింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై తాను ప్ర‌త్యేక దృష్టి సారించాల్సి వ‌స్తోంద‌ని రాష్ట్ర వ‌ర్కింగ్ క‌మిటీ ప్ర‌సిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నిక‌లు త‌న పనితీరుకు ప‌రీక్ష‌గా భావిస్తున్నాన‌ని అన్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ భ‌వ‌న్‌లో ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు.

రాష్ట్రంలో జ‌రిగే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అన్ని స్థానాలు కైవ‌సం చేసుకుంటామ‌ని, అఖండ మెజార్టీతో గెలుపొందుతామ‌ని ధీమా వ్యక్తం చేశారు. అలాగే పార్టీలోని కొందరు రెబల్స్‌గా నామినేషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో వారిని పోటీ నుంచి తప్పుకునేలా మంత్రులు, జిల్లా నాయకులు బుజ్జగింపులు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి కార్పొరేషన్‌ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడారు. అభ్యర్థుల నామినేషన్లు, ప్రచార కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. కొత్త, పాత అనే తేడా లేకుండా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తామని కేటీఆర్‌ అన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీలో తొమ్మిది సభ్యులను సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కేటీఆర్‌ చేర్చారు. నల్గొండ- పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మెదక్‌-శేరి సుభాష్‌రెడ్డి, వరంగల్‌-గ్యాదరి బాలమల్లు, కరీనంగర్‌- బొంతు రామ్మోహన్‌, రంగారెడ్డి-కే నవీన్‌ కుమార్‌, నిజామాబాద్‌- మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఆదిలాబాద్‌-దండే విఠల్‌, ఖమ్మం-గట్టు రాంచందర్‌రావు, మరో సభ్యుడు ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి ఉండగా, పాలమూరు బాధ్యతలు ఇంకా ఎవరీకి కేటాయించలేదు. ఈ సమన్వయ కమిటీ పురపాలిక ఎన్నికల్లో కార్యకలాపాలను నిర్వహించనుంది. లోకల్‌ క్యాడెర్‌కు పలు సలహాలు, సూచనలను ఇవ్వనున్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులతో మాట్లాడనున్నారు. అలాగే సోషల్‌ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం చేయాలని నేతలకు కేటీఆర్‌ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి రోజు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ తెలిపారు.

Next Story
Share it