ఓటు రేటు.. చాలా హాట్ గురూ..!

By అంజి  Published on  22 Jan 2020 8:35 AM IST
ఓటు రేటు.. చాలా హాట్ గురూ..!

తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు సాగుతుంది. మొత్తం 53,36,505 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 26,71,694 మంది ఉండగా… 26,64,557 మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 6.40 లక్షల మంది ఓటర్లు, అత్యల్పంగా జనగామ జిల్లాలో 39,729 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం కార్పొరేషన్లలోని 325 డివిజన్లకు గాను ఒక వార్డు ఏకగ్రీవం అయ్యింది. మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులను గాను 80 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కరీంనగర్‌లో ఈ నెల 24న ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఇవాళ సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం జరగనుంది. జనవరి 25న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంది. 50 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.

మిర్యాలగూడలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, సూర్యాపేట 44వ వార్డులో మంత్రి జగదీశ్‌ రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గద్వాలలో కాంగ్రెస్‌, ఎంఐఎం కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దొంగ ఓట్లు పడకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కొత్త పద్ధతిని అమలు చేస్తోంది. ఓటు వేసే సమయంలో ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ను ప్రారంభించింది. దీనిని ఫైల్‌ ప్రాజెక్టు కింద కొంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో అమలు చేస్తున్నారు.

పోలింగ్‌ ప్రక్రియకు ముందు పట్ణాణాల్లో నగదు, మద్యం పంపిణీ పెద్ద ఎత్తున జరిగింది. ఓటర్లను అభ్యర్థుల పార్టీలు ప్రలోభాలకు గురి చేశాయి. బోడుప్పల్‌, మేడ్చల్‌లో బంగారు నాణెలను సైతం పంచారు. ప్రధాన పార్టీ నేతలు ఒకరిమించి మరోకరు నగదు పంపిణీ చేశారు. ఒక్క బడంగ్‌ పేటలోనే ఒక్క ఓటుకు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు పంపిణీ చేశారంటే.. మీరే అర్థం చేసుకోవచ్చు. పీర్జాదిగూడలో ఓ డివిజన్‌లో ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోరుతో ఒక్కో ఓటుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పంచారు.

ఎన్నికల అభ్యర్థులు టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. చాలా చోట్ల నగదు రహిత డిజిటల్‌ యాప్‌ల ద్వారా డబ్బులు పంచారు. మద్యం అయితే ఎప్పటిలాగే ఎరులై పారింది. మంగళవారం రాత్రి వరకు కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి. యాదాద్రి భువనగిరి మునిసిపాలిటీకి చెందిన ఓ అభ్యర్థి ఢిల్లీలో నివాసం ఉండే ఓటర్ల కోసం ఫస్ట్‌ క్లాస్‌ రైలు టిక్కెట్‌ను బుక్‌ చేశారు. మరికొందరు అభ్యర్థులు గ్యాస్‌ సిలిండర్లు, ఐదేళ్లు మినరల్‌ వాటర్‌ ఉచితంగా ఇస్తామని ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. రామాయంపేటలో అభ్యర్థులు ఓటర్లకు వెండి కుంకుమ భరిణెలు పంచారు. మంచిర్యాల జిల్లాలో ఒక్కో వార్డుకు దాదాపు రూ.3 కోట్లు పంచినట్లు సమాచారం. హుజుర్‌నగర్‌లోని ఓ వార్డులో ఇంటింటికి కిలో మటన్‌ పంపిణీ చేశారు.

Next Story