కచ్చులూరు బోటు ప్రమాద బాధితులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
By అంజి Published on 25 Nov 2019 6:50 PM ISTవరంగల్: కచ్చులూరు బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చెక్కులను అందజేశారు. మరో 5 కుటుంబాలకు రూ.6 లక్షల లెబర్ ఇన్సూరెన్స్ చెక్కులను సైతం బాధిత కుటుంబాలకు అందజేశారు. ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధకరమని ఎమ్మెల్యే ఆరూరి అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలను బోటు ప్రమాద బాధితులకు మంజూరు చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, ఏపీ సీఎం జగన్ ప్రత్యేక చొరవ తీసుకొని బాధిత కుటుంబాలకు అండగా నిలిచినందుకు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ధన్యవాదాలు తెలిపారు.
రెండు నెలల క్రితం కాజీపేట మండలం కడిపికొండకు చెందిన 9 మంది విహార యాత్రకు వెళ్లి బోటు ప్రమాదంలో మృతి చెందిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ ఆదేశాలతో హటాహుటిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నేను సంఘటనా స్థలానికి వెళ్లామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆరూరి రమేష్ పేర్కొన్నారు. ఆరోగ్యం సహకరించకున్నా వారం రోజుల పాట అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాలుపంచుకున్నానని ఎమ్మెల్యే ఆరూరి వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, కాజీపేట ఎమ్మార్వో నాగేశ్వర్ రావుతో పాటు ఇతర అధికార యాత్రాంగం కూడా తీవ్రంగా శ్రమించారని.. ఈ సందర్భంగా వారిని ఆరూరి రమేష్ అభినందించారు. బోటు ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని పేర్కోన్నారు. వీటితో పాటు పార్టీ సభ్యత్వం ఉన్న వారికి మరో రెండు లక్షల పార్టీ ఇన్సురెన్స్ చెక్కులను సైతం త్వరలోనే అందించనున్నట్లు ఎమ్మెల్యే అరూరి తెలిపారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాడని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, ఆర్డీఓ వెంకా రెడ్డి, ఎమ్మార్వో నాగేశ్వర్ రావు, కార్పోరేటర్ బస్కె శ్రీలేఖ, కూడా అడ్వైజరీ కమిటీ మెంబర్ వనం రెడ్డి, అధికారులు, స్థానిక డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.