బిగ్‌బ్రేకింగ్: లాక్‌డౌన్ పొడిగించాల్సిందే: సీఎం కేసీఆర్
By సుభాష్ Published on 6 April 2020 8:45 PM IST
ముఖ్యాంశాలు
పలు సంస్థలు కూడా లాక్‌డౌన్ పొడిగించాలని సూచిస్తున్నాయి
కరోనాను తరిమికొట్టాలంటే లాక్‌డౌన్ పొడిగించాల్సిందే
జూన్ 3 వరకు పొడిగించాలని మోదీకి చెప్పా
ఏదేమైనా ఇంకొన్ని రోజులు లాక్‌డౌన్ తప్పదు
మీడియాతో ముఖ్యమంత్రి కేసీఆర్
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కొరలు చాస్తోంది. రోజురోజుకు విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను పూర్తి స్థాయిలో తరిమికొట్టాలంటే లాక్‌డౌన్ పొడిగించాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తప్పని సరి పరిస్థితుల్లో లాక్‌డౌన్ పొడిగించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరినట్లు అన్నారు. సోమవారం ప్రగతి భవన్‌లో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ వంటి సంస్థలు కూడా లాక్‌డౌన్ పొడిగించాలని సూచిస్తున్నాయని, ఆ సూచన మేరకు జూన్ 3 వరకు లాక్‌డౌన్ పొడిగించాల్సి ఉంటుందని, ఈ విషయమై ప్రధాని మోదీకి విన్నవించానని అన్నారు.
20 దేశాలు పూర్తిగా, మరో 90 దేశాలు పాక్షికంగా లాక్‌డౌన్ విధించాయన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశంలో కూడా లాక్‌డౌన్ పొడిగించడమే మంచిదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం ఆషామాషీ వ్యవహారం కాదని, లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే ఒక్కసారిగా జనాలు రోడ్లపైకి వస్తారని, అలాంటిప్పుడు ప్రస్తుతం విధించిన 21 రోజుల లాక్‌డౌన్ వృధా అయిపోతుందని అన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేస్తే కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని అన్నారు. అందుకే లాక్‌డౌన్ పొడిగించాలని ప్రధాని మోదీకి చెప్పానని అన్నారు.
ఇక తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 364కు చేరిందని, వీరిలో 45 మంది పూర్తిగా కోలుకున్నారని, 11 మంది మృతి చెందారని కేసీఆర్ వెల్లడించారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 308 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. అలాగే మరో రెండు రోజుల్లో మర్కజ్ కేసులతో లింకులున్న వారందరికి పరీక్షలు పూర్తవుతాయన్నారు. మరో 110 పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కాంటాక్ట్ కేసులు మరింత పెరిగే అవకాశాలున్నాయన్నారు.