హైదరాబాద్‌: కరోనా వైరస్‌ను కట్టడి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నిన్న చేపట్టిన జనతా కర్ఫ్యూను ప్రజలు విజయవంతం చేశారని పేర్కొన్నారు. అయితే జనతా కర్ఫ్యూలో ప్రజలు నిన్న చూపించిన స్ఫూర్తిని ఇవాళ చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ కోరారని.. అందుకే అంతర్జాతీయ విమానాలు నిలిపివేశారని తెలిపారు. సీసీఎంబీలో ఒకే సారి 900 మంది కరోనా టెస్టులు చేయొచ్చన్నారు.

తెలంగాణలో కరోనా ఇప్పటి వరకు ఒక్కరూ కూడా చనిపోలేదని మంత్రి ఈటల అన్నారు. ప్రస్తుతం 33 కేసుల్లో 31 కరోనా కేసులు బయటికి వెళ్లిన వారివేనని, ఇద్దరికి ప్రైమరీ కాంటాక్ట్‌ ద్వారా కరోనా సోకిందన్నారు. ఒకరు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కాగా మరోకరు కరీంనగర్‌కు చెందిన వ్యక్తి అని తెలిపారు. ఇప్పుడున్న పాజిటివ్‌ కేసుల్లో ఎవ్వరికీ సీరియస్‌ లేదన్నారు. ఇటలీ అనుభవాల తర్వాత.. వైరస్‌ సోకిన తర్వాత ట్రీట్మెంట్‌ కన్నా.. ముందే అరికట్టడం ముఖ్యమన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని అసాధారణ నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని మంత్రి ఈటల వ్యాఖ్యనించారు.

Also Read: జైల్లో విధ్వంసం.. తిరుగుబాటులో 23 మంది ఖైదీలు మృతి

రాష్ట్రంలో ఇప్పటి వరకు 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 97 మంది కరోనా అనుమానితులు ఉన్నారని చెప్పారు. క్వారంటైన్‌లో ఉన్న వారు ఎట్టిపరిస్థిత్తుల్లోనూ బయటకు రావొద్దని.. బయటి వస్తే చర్యలు తప్పవని మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిదని.. అయిన కొందరు కొంపలు మునిగిపోయినట్టు బయటకు వస్తున్నారని మంత్రి ఈటల అసహనం వ్యక్తం చేశారు. ప్రాణాలు ముఖ్యమా?.. బయటకు వెళ్లి పని చేసుకోవడం ముఖ్యమా? ప్రతి ఒక్కరూ అలోచించుకోవాలన్నారు.

రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టంతో ఆరోగ్య శాఖ మంత్రి మ‌రో ముఖ్య‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. రేప‌టి నుండి ఇంటింటి స‌ర్వేకు శ్రీకారం చుట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీని ద్వారా అనుమానితుల‌ను గుర్తించ‌వ‌చ్చ‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.