జైల్లో విధ్వంసం.. తిరుగుబాటులో 23 మంది ఖైదీలు మృతి

By అంజి  Published on  23 March 2020 10:04 AM GMT
జైల్లో విధ్వంసం.. తిరుగుబాటులో 23 మంది ఖైదీలు మృతి

కరోనా వైరస్‌.. ఇప్పడిది ప్రపంచాన్నే వణికిస్తోంది. ఈ వైరస్‌ ఇప్పటికే అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించి గడగడలాడిస్తోంది. ఇక బయట తిరిగే వారితో పాటు జైళ్లలో ఉన్న ఖైదీలు సైతం కరోనాతో వణికిపోతున్నారు. కొన్ని చోట్ల జైళ్లలో అధికారులపై ఖైదీలు తిరుగుబాటు చేస్తున్నారు. జైలు అధికారులపై జరుగుతున్న దాడులు చాలా ఆందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా కొలంబియా రాజధాని బొగొటా జైలులో ఖైదీలు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో దాదాపు 23 మంది కన్నుమూశారు. మరో 83 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

జైలులో అపరిశుభ్రత కారణంగా ఈ దాడులు జరిగాయని తెలిసింది. తాము జైల్లో ఉండలేమంటూ ఖైదీలు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై ఆ దేశ న్యాయశాఖ మంత్రి మార్గరిటా క్యాబెల్లో స్పందించారు. ఇలా జరగడం తమ దేశాన్ని తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జైళ్లో అపరిశుభ్రత కారణంగా కరోనా సోకే అవకాశం ఉందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.

దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో జరుగుతున్న తిరుగుబాట్ల వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి వరకు జైళ్లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నిర్దారణ కాలేదన్నారు. జైళ్లో నుంచి తప్పించుకునేందుకే ఖైదీలు ఇలా ప్రవర్తిస్తున్నారని క్యాబెల్లో అన్నారు. కొలంబియా దేశంలో ఇప్పటి వరకు 231 కరోనా వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి. కరోనా సోకి ఇద్దరు మరణించారు. కరోనా వైరస్‌ కట్టడి నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేసింది.

Next Story