తెలంగాణ సర్కార్ కొత్త‌ జీవో.. వారికి పండ‌గే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 July 2020 7:04 AM GMT
తెలంగాణ సర్కార్ కొత్త‌ జీవో.. వారికి పండ‌గే..

కరోనా కాలంలో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్న కొన్ని ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల తీరు అందరికి తెలిసిందే. కరోనా కారణంగా ఆసుపత్రి మెట్లు ఎక్కితే చాలు.. బెడ్ పేరిట చేస్తున్న దందా తెలిసిందే. చేతిలో క్యాష్ పెడితేనే ఆసుపత్రిలో ఆడ్మిషన్ ఇస్తున్నారు. లేదంటే.. తామేమీ చేయలేమంటున్నారు. ఇదేం పద్దతని నిలదీస్తే.. ఆసుపత్రిలో బెడ్లు లేవని తేల్చి చెబుతున్న వైనంతో ప్రజలు నానా ఆగచాట్లు పడుతున్నారు. లక్షలాది రూపాయిల బీమా ఉన్నా.. వాటితో తమకు సంబంధం లేదని.. ధనార్జనే ధ్యేయంగా సాగుతున్న ఆసుపత్రుల దందాపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇరుగున ఉన్న ఏపీలో ప్రైవేటు ఆసుపత్రుల్ని తన నియంత్రణలోకి తెచ్చుకొన్న ఏపీ సర్కారు కారణంగా.. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో పరిస్థితి మెరుగ్గా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రుల తీరును సరిదిద్దే చర్యలు తీసుకోకపోగా.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక జీవో ఇప్పుడు షాకింగ్ గా మారింది.

తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ఈ జీవో ప్రకారం కరోనా సోకిన పేషెంట్ కు బీమా కింద ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే.. ప్రభుత్వం ఆ మధ్య నిర్దేశించిన ధరలు వర్తించవని స్పష్టం చేసింది. అంతే కాదు.. కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు.. అవగాహన ఒప్పందాలు చేసుకున్న వారికి చికిత్స చేసే సమయంలోనూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలు వర్తించవని చెప్పటం ఇప్పుడు సంచలనంగా మారింది.

దేనికి ఎంత వసూలు చేయాలన్న రూల్ పెడితేనే.. దందా చేసిన ప్రైవేటు..కార్పొరేట్ ఆసుపత్రులు.. అందుకు భిన్నంగా కార్పొరేట్ ఆసుపత్రిలో ఇన్య్సూరెన్స్ ఉండి వైద్యం చేయించుకునే వారికి తాము నిర్దేశించిన ధరలు వర్తిచవని చెబితే.. ఇక వారిని ఆపటం సాధ్యమవుతుందా? అన్నది ప్రశ్నగా మారింది.

ఇటీవల కాలంలో కరోనా చికిత్సకు కార్పొరేట్ ఆసుపత్రులు వేస్తున్న బిల్లులతో గుండె గుభేల్ మంటున్న పరిస్థితి. చాలా ఆసుపత్రులు కరోనాకు చికిత్స చేసిన వారికి రూ.10 నుంచి రూ.25 లక్షల వరకు బిల్లులు వేస్తున్నాయి. ఛార్జీల విషయంలో ప్రభుత్వం ఫలానా మొత్తాన్ని వసూలు చేయాలంటేనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇప్పుడీ జీవో విడుదలతో పరిస్థితి మరెలా తయారవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Next Story