ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న సీఎం
By అంజి Published on 31 May 2023 1:00 PM IST
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 గంటలకు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం జెండా ఆవిష్కరిస్తారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఉన్నతాధికారులకు ఇన్విటెషన్ పంపారు. శుక్రవారం ఉదయం గన్‌పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి సీఎం నివాళులర్పిస్తారు. ఆ తర్వాత సచివాలయంకు చేరకుంటారు. అక్కడ రాష్ట్ర పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్.. దశాబ్ది ఉత్సవ సందేశం ఇస్తారు.
అదే సమయంలో రాష్ట్రంలోని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశ కార్యక్రమాలు జరుగుతాయి. సచివాలయంలో జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులు, సిబ్బంది హాజరుకావాలని సీఎం శాంతకుమారి ఆదేశాలు జారీ చేశారు. అన్ని విభాగాల అధిపతులకు సీఎం కార్యాలయం నుండి ఇన్విటేషన్ కార్డులు పంపారు. సచివాలయంలోకి ఎంట్రీ కావడానికి వీలుగా ఇన్విటేషన్ కార్డులకు ఎంట్రీ కార్డులు కూడా జత చేశారు. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే అధికారులు తమ ఆహ్వాన కార్డు, గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.
శుక్రవారం ఉదయం 9 గంటలకల్లా సచివాలయానికి చేరుకొని, ఉదయం 9.30 గంటల్లోగా తమ స్థానాల్లో కూర్చోవాలని సీఎస్ శాంత కుమారి సూచించారు. సకాలంలో సచివాలయానికి చేరేందుకు వీలుగా తమ కార్యాలయాల్లో ఉదయం 7.30 గంటలకే జాతీయ పతాకావిష్కరణ పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. ఇదిలా ఉంటే.. అటు గోల్కొండలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న ఉదయం 6.30 గంటలకు గొల్కొండ కోటలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారని సమాచారం. అదే రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.