మన తెలంగాణ మహారాష్ట్ర బాటలో పయనిస్తుందా?

By రాణి  Published on  29 Jan 2020 10:41 AM IST
మన తెలంగాణ మహారాష్ట్ర బాటలో పయనిస్తుందా?

మహారాష్ట్రలో రాత్రిళ్లు వెలిగిపోతున్నాయి. ఇన్నాళ్లూ పదిన్నర పదకొండు దాటగానే దుకాణాల్ని మూసేసేవారు. జనవరి 27 నుంచి నైట్ కి నిజంగా లైఫ్ వచ్చింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో రాత్రంతా షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్సులు, ఇతర వాణిజ్య సముదాయాలు తెరిచి ఉంటున్నాయి. ప్రస్తుతానికి ముంబైలో 25 ప్రధాన మార్కెట్లలో ఈ నైట్ లైఫ్ ను అమలు చేస్తున్నారు. క్రమేపీ ముంబై మొత్తానికి దీన్ని విస్తరించబోతున్నారు. నైట్ డ్యూటీలు చేసేవారికి, రాత్రిళ్లు నగర యానం చేసి ఎంజాయ్ మెంట్ పొందేవారికి ఇప్పుడు పండగే పండగ. క్లబ్బు రాయుళ్లు ఇక రాత్ కా రాజాలు. పబ్బు మహిళలకు కూడా ఇకపై రాత్ కీ రాణీలు.

ఇప్పుడు ఈ నైట్ లైఫ్ ను హైదరాబాద్ లోనూ అమలు చేయాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. షాపింగులు, సరదాలు ఒక్క ముంబైకేనా? మాకు వద్దా అని హైదరాబాదీలు అడుగుతున్నారు. మన తెలంగాణలోనూ ఈ పద్ధతి కావాలని కోరుతున్నారు. అసలీ నైట్ లైఫ్ కాన్సెప్ట్ లండన్ లో మొదలైంది. ఇప్పుడు ముంబైకి పాకింది. త్వరలో మన హైదరాబాద్ కు విస్తరిస్తే ఆశ్చర్య పోనక్కర్లేదు.

నిజానికి బూమింగ్ సాఫ్ట్ వేర్ పరిశ్రమ, కాల్ సెంటర్ల నైట్ డ్యూటీలు, బోలెడన్ని మల్టీ ప్లెక్సులు , మెట్రో సర్వీసులు ఉన్న హైదరాబాద్ లో ప్రతి రోజూ వేలాది మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. లక్షలాది మంది నైట్ డ్యూటీలు చేస్తారు. ఈ నేపథ్యంలో అప్పట్లో జీ హెచ్ ఎం సీ కమీషనర్ గా ఉన్న సమీర్ శర్మ నైట్ లైఫ్ ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. దీని వల్ల వ్యాపారాలు పెరుగుతాయని, నైట్ డ్యూటీలు వల్ల చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని, ప్రభుత్వానికి పన్నులు వస్తాయని ఆయన ప్రతిపాదించారు. కానీ ఎందుకో గానీ ఆ పథకాలు, ప్రతిపాదనలు కాగితాల్లోనే ఉండిపోయాయి. నిజానికి చార్మినార్, శిల్పారామాల వద్ద నైట్ లైఫ్ విధానాన్ని అమలు చేయాలని కూడా ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఆ ప్రతిపాదనలకూ మోక్షం రాలేదు.

అయితే ఒక్కటే సమస్య ఉంది. రాత్రి వేళ శాంతి భద్రతల పరిరక్షణ చాలా కష్టం. నైట్ లైఫ్ ను అనుమతిస్తే, తలెత్తే శాంతి భద్రతల సమస్యను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మతకల్లోలాలు, గూండాగిరి, మాఫియాల వంటి సమస్యలు హైదరాబాద్ లో లేవు, ఈ నేపథ్యంలో తగినంత మంది పోలీసులను వినియోగించడం, దానితో పాటు గస్తీలు పెంచడం చాలా అవసరం. ఇదే కనుక జరిగితే మన సాఫ్ట్ వేర్ క్రౌడ్ కి ఇక పండగే పండగ. చూద్దాం ఏమవుతుందో?

Next Story