తెలంగాణలో వెయ్యి ఎకరాల్లో ఆటో మొబైల్ తయారీ యూనిట్: కేటీఆర్
By సుభాష్ Published on 30 Oct 2020 8:05 AM GMTతెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌లు శుక్రవారం ప్రారంభించారు. వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. దీని కోసం రాష్ట్రంలోనే తయారీ యూనిట్లు, చార్జింగ్ యూనిట్లను పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం రాయితీలను ప్రకటించింది. జూబ్లీహిల్స్ మర్రి చెన్నారెడ్డి వనరుల కేంద్రంలో పాలసీ విధానాన్ని మంత్రులు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధన నిల్వలకు కొత్త విధానం అమలు చేయనుందని, 2020-2030 వరకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగంపై విధి విధానాలపై మంత్రి ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చబోతున్నామని, ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణం ఫ్రెండ్లీ వెహికిల్స్ అని అన్నారు. ఇప్పటికే టీఐపాస్, బీఎస్ ఐపాస్ విజయవంతం అయ్యాయని, ఈ వాహనాలు కూడా విజయవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి 2.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా ఐదు కంపెనీలతో ఈ రోజు ఒపపందాలు చేసుకున్నారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజలతో పాటు, రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు.
వెయ్యి ఎకరాల్లో ఆటో మొబైల్ తయారీ యూనిట్
కాగా, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని, ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ తయారీ కంపెనీలు పెట్టుబడి పెట్టనున్నాయని, ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం భూములు అందుబాటులో ఉన్నాయని కేటీఆర్ అన్నారు. మహేశ్వరంలో వేల ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. వెయ్యి ఎకరాల్లో ఆటో మొబైల్ తయారీ యూనిట్‌ను ప్రోత్సహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
గతంలో ఈసీఐఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశానికే హైదరాబాద్ కేంద్రంగా ఉండేదని, ఎలక్ట్రీక్ వాహనాల నూతన విధానం ఎంతో అద్భుతంగా విజయవంతం కాబోతోందన్నారు.హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఎలక్ర్టిక్ వాహనాల తయారీ యూనిట్లు నెలకొల్పుతామని చెప్పారు.