వైద్యురాలి హత్యపై తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు
By Newsmeter.Network Published on 30 Nov 2019 6:28 PM ISTహైదరాబాద్లో వెటర్నరీ వైద్యురాలు హత్యపై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని నిరసనలు చేపట్టారు. విజయవాడలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఆడ పిల్లలను రక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించిన ఈ ర్యాలీకి శారదా కళాశాలకు చెందిన విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అలాగే గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నారై ఇండియన్ ప్రిన్స్ విద్యార్థులు కూడా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు సేవ్ గర్ల్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక గుంటూరులో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు.. నోటికి నల్ల రిబ్బన్లతో ర్యాలీ చేపట్టారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలంటే నిందితులకు అక్కడికక్కడే శిక్షలు పడాలని నినదించారు. ఈ సందర్భంగా తిరుపతిలో విద్యార్థి సంఘాలు ర్యాలీ చేపట్టాయి. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం నుంచి ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు... యువతి చిత్రపటానికి నివాళులు అర్పించారు.
అలాగే.. యువతి హత్యకు కారకులైన నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ... విశాఖలో విద్యార్థి సంఘాలు, వైసీపీ యువజన సంఘం కార్యకర్తలు మౌన ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.