485 ప్రమాదకర ప్రాంతాలు.. భయపడుతున్న తెలంగాణ ప్రజలు
By అంజి Published on 3 Feb 2020 12:05 PM ISTతెలంగాణలోని రోడ్లు నెత్తురోడుతుండగా.. దారికాచి మరి మృత్యువు ప్రాణాలను కబళిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రమాదకర బ్లాక్ స్పాట్స్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే అలాంటి చోట్ల అధికారులు మాత్రం దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. ఒకేచోట పలుమార్లు ప్రమాదం జరిగితే దానిని పోలీసులు ప్రమాదకర ప్రాంతంగా గుర్తిస్తారు. ఆ తర్వాత ఆ వివరాలను పోలీసులు భవనలశాఖ పంపుతారు. అది ప్రమాదకర ప్రాంతమా.. కాదా అని గుర్తించడానికి అధికారులు నిపుణులతో కలిసి విశ్లేషిస్తారు. ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి అన్న అంశంపై అధ్యయనం చేస్తారు. మొదటగా దిద్దుబాటు చర్యలకు తొలి ప్రాధ్యాన్యమిస్తారు. ఆ తర్వాత నిధుల మేరకు చర్యలు చేపడతారు.
ప్రతి ప్రమాదాన్ని పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తారు. అయితే ఇక్కడ ప్రమాదాల నివారణకు చేపట్టే దిద్దుబాటు చర్యల్లో జాప్యం జరుగుతూ వస్తోంది. దీని కారణంగానే గత మూడేళ్లలో తెలంగాణలో 5,740 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 2,376 మంది తమ ప్రాణాలను విడిచిపెట్టారు. ఈ ప్రమాదాలన్ని కేవలం 485 ప్రమాదకర ప్రాంతాల్లో మాత్రమే జరిగాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 485 ప్రమాదకర ప్రాంతాలను పోలీసులు గుర్తించగా.. వాటిలో 314 ప్రమాద ప్రాంతాలు రోడ్లు భవనాల శాఖ పరిధిలోనివి కాగా, మిగిలిన 171 ప్రమాద ప్రాంతాలు జాతీయ రహదారుల సంస్థ పరిధిలో ఉన్నట్లు సమాచారం. అయితే ఆ ప్రాంతాలను దిద్దుబాటు చర్యలు ఎప్పుడు చేపడతారన్నది అధికారులకే తెలియాలి.
రాష్ట్రంలో గుర్తించిన 485 ప్రమాద ప్రాంతాల్లో 2016 సంవత్సరంలో 2,050 ప్రమాదాలు జరగగా.. 841 మంది చనిపోయారు. 2017లో 1,750 ప్రమాదాలు జరగగా.. 771 మంది మృతి చెందారు. 2018లో 1,940 ప్రమాదాలు జరగగా 764 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా మృతి చెందే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గత మూడేళ్లలో ప్రమాదాల సంఖ్య స్వల్పంగా తగ్గినా.. మృతుల సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తోంది. అధికారులు వెంటనే ప్రమాదకర ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
సదాశివపేటలోని నందికంది గ్రామంలో గత మూడేళ్లలో 31 ప్రమాదాలు జరిగాయి. అందులో 22 మంది చనిపోయారు. నందికంది గ్రామాన్ని రెండుగా చీల్చుతూ నిర్మించిన ముంబై వేళ్లే జాతీయ రహదారే వారి పాలిట శాపంగా మారింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.