తెలంగాణ: మన సంగతి వదిలేసి అమెరికా దాకా ఎందుకు?
By సుభాష్ Published on 29 July 2020 7:00 AM GMTనిజాన్ని దమ్ముగా చెప్పేయొచ్చు. అందుకు భిన్నంగా వ్యవహరించే సమయంతోనే ఇబ్బంది అంతా. అలా అని అడ్డగోలుగా అబద్ధాలు చెప్పేస్తున్నారన్నది మా ఉద్దేశం కాదు. నిజం చెప్పకపోవటం.. అబద్ధం చెప్పినట్లు అవుతుందన్నది సరికాదన్నది మర్చిపోకూడదు. తాజాగా తెలంగాణ రాష్ట్రమంత్రి ఈటెల రాజేందర్ పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు.
ఎందుకు దాస్తున్నారో? దాని వల్ల ఎలాంటి ఉపయోగమో? ఎవరికి తెలీదు. కానీ.. తెలంగాణలో కరోనాకు సంబంధించిన వివరాల్ని వెల్లడించే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద ఇప్పటికే పలుమార్లు హైకోర్టు తప్పులు ఎత్తి చూపింది. పద్దతి మార్చుకోవాలని పేర్కొంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సర్కారులో మార్పులు రాని పరిస్థితి. దీనివల్ల సాధించేదేమిటి? అన్నది పెద్ద ప్రశ్న. పక్కనే ఉన్న ఏపీ విషయానికివస్తే.. రోజులో 80 మంది మరణిస్తే.. అవును.. మా దగ్గర ఎనభై మంది మరణిస్తున్నారని ఓపెన్ గా డిక్లేర్ చేస్తున్నారు.
రోజులో ఎడెనిమిదివేల మంది పాజిటివ్ బారిన పడితే.. ఏ మాత్రం దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తున్న ఏపీ తీరును పలువురు అభినందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నిజం చేదుగా ఉంటుంది. అలా అని సత్యాన్ని దాచేస్తే.. దాని వల్ల కలిగే ప్రయోజనం కంటే.. నష్టమే అధికంగా ఉంటుంది. కేసుల తీవ్రతను తక్కువ చేస్తే.. ప్రజల్లో భయాందోళనలు ఎక్కువ అవుతాయన్న వాదన లేనిది. ఎందుకంటే.. కేసుల తీవ్రత వెల్లడి కావటం ద్వారా ప్రజల్లో అప్రమత్తత పెరిగే అవకాశం ఎక్కువ అవుతుందన్నది కూడా మర్చిపోకూడదు.
అయితే.. ఈ విషయంలో తెలంగాణ సర్కారు ఆలోచన మాత్రం బిన్నంగా ఉండటం తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్రమంత్రి ఈటెల మాట్లాడుతూ.. మన దేశంలో కరోనావైరస్ అమెరికా అంత సీరియస్ కాదని.. రాష్ట్రంలో 81 శాతం మంది కోవిడ్ లక్షణాలు లేకుండానే కోలుకుంటున్నట్లు చెబుతున్నారు. వైరస్ కట్టడికి సర్కారు అన్ని చర్యలు తీసుకుంటుందని చెబుతున్న ఆయన మాటల్లో అమెరికా పేరు వాడాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న.
ఎక్కడైనా పోల్చుకుంటే మంచితో పోల్చుకోవాలి. ప్రపంచంలో అమెరికాలో నెలకొన్న నిర్లక్ష్యం మరెక్కడా లేదని అందరూ చెబుతున్నారు. కరోనా మీద అనుసరించాల్సిన విధానానికి సంబంధించి లోపించిన స్పష్టతే ఈ రోజున ఆ దేశంలో లక్షలాది కేసులే కాదు.. లక్షకు పైనే దాటేసిన మరణాలకు కారణమవుతాయని చెప్పక తప్పదు. అలాంటి అమెరికాను ఉదాహరణగా చెప్పటంలో అర్థం లేదు. నిజానికి అమెరికాలో వైరస్ బలంగా ఉంది.. భారత్ లో లేదన్నదానిలో వాస్తవం లేదు.
ఎందుకంటే.. భారత్ లో వైరస్ బలంగా లేకుండా.. కొన్ని రాష్ట్రాల్లో భారీగా చనిపోతుంటే.. కేరళ లాంటి రాష్ట్రంలో అతి స్వల్పంగా మాత్రమే కరోనా కారణంగా మరణిస్తున్నారన్నది మర్చిపోకూడదు. ఇలాంటి సందర్భాల్లో అమెరికాను ఉదాహరణగా తీసుకొనే బదులు.. కేరళను ఎందుకు ఈటెల ప్రస్తావించరన్నది ప్రశ్న.
కరోనాకు సంబంధించిన వివరాల్నివెల్లడించటంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు సరిగా వ్యవహరించటం లేదన్న అపవాదును అధిగమించేందుకు ఆయన కవర్ చేసుకుంటున్న వైనం చూస్తే.. నవ్వు రాక మానదు. అందుకే అనేది.. నిజాన్ని సూటిగా చెప్పేయొచ్చు. కానీ.. నిజం చెప్పాలన్న ఆలోచన లేనప్పుడు.. నిజం చెబుతున్నామన్న విషయాన్ని కన్వీన్స్ చేసేందుకు కిందామీదా పడాల్సిన అవసరం ఉందన్నది ఈటెల పడే ప్రయాసను చూస్తే.. ఇట్టే అర్థమవుతుందన్నమాట వినిపిస్తోంది.