తెలంగాణలో తొమ్మిదికి చేరిన కరోనా మరణాలు..

By అంజి  Published on  2 April 2020 1:30 AM GMT
తెలంగాణలో తొమ్మిదికి చేరిన కరోనా మరణాలు..

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. బుధవారం నాడు కరోనా సోకిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరో 30 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 127కు చేరుకుంది. బుధవారం కరోనా అనుమానితులకు జరిపిన వైద్య పరీక్షల్లో 30 మంది కరోనా బారినపడ్డారని వైద్యులు గుర్తించారు.

బుధవారం సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు, యశోదా ఆస్పత్రిలో ఒకరు చనిపోయారని అధికారులు తెలిపారు.

అలాగే నిజాముద్దీన్‌ మర్కజ్‌ వెళ్లొచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉన్నాయని, వారి ద్వారా కుటుంబ సభ్యులకు మాత్రమే కరోనా వైరస్‌ సోకుతోందని వైద్య పరీక్షల్లో తేలిందని అధికారులు అన్నారు. విదేశాల నుంచి వారిలో కొంత మంది వైరస్‌ సోకిందని, వారి ద్వారా మరికొంత మందికి వైరస్‌ సోకిందని ఆరోగ్య శాఖ అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు.

ఢిల్లీ వెళ్లి వచ్చిన 1030 మందిలో 160 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వీరి ద్వారా సుమారు 2 వేల మంది కరోనా వైరస్‌ వ్యాప్తి అయి ఉండొచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 500 మంది నుంచి నమునాలు సేకరించినట్లు వైద్యులు తెలిపారు.

ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేసిన లాక్‌డౌన్‌ ప్రజలు విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రజలను కోరారు. మరికొన్ని రోజుల పాటు ప్రజలు సహకరించాలన్నారు. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుందామని సీఎం పేర్కొన్నారు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. వైద్య సిబ్బందికి అవసరమైన పిపిఈ కిట్స్‌, ఎన్‌ 95 మాస్క్‌లు, హైడ్రాక్సి క్లోరోక్విన్‌ మాత్రలు సిద్దంగా ఉన్నాయని వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సీఎం కేసీఆర్‌ వివరించారు.

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న వైద్య , పోలీసు సిబ్బందిని వేతనాల కోత నుంచి మినహాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. వీరికి మార్చి నెల పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహం ( ఇన్సెంటివ్ ) కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఇన్సెంటివ్ ను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

Next Story