గ్రేటర్‌ హైదరాబాద్‌లో 703.. జిల్లాల్లో 727 కేసులు

By సుభాష్  Published on  22 July 2020 3:37 AM GMT
గ్రేటర్‌ హైదరాబాద్‌లో 703.. జిల్లాల్లో 727 కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో పెరిగిపోతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక హైదరాబాద్‌లో మాత్రం పాజిటివ్‌ కేసులకు అంతే లేకుండాపోతోంది. మంగళవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ కంటే జిల్లాల్లోనే ఎక్కువగా నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 1430 కేసులు రాగా, ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 703, జిల్లాల్లో 727 నమోదయ్యాయి. ఇక ఆది, సోమవారాల్లో మొత్తం కేసుల్లో జిల్లాల్లో 57శాతం ఉండగా, మంగళవారం 51శాతానికి తగ్గింది.

మంగళవారం నాటి కేసులను చూస్తే.. రంగారెడ్డి జిల్లావి 117,మేడ్చల్‌ 105, సంగారెడ్డి 50, నల్గొండ 45, కామారెడ్డి 43, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 34 కేసులు నమోదయ్యాయి. మొత్తం 16,855 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 8.5శాతం మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది.

మరణాలు:

ఇక రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 429కి చేరింది. ఇక కరోనా మహమ్మారి ఎవ్వరిని కూడా వదిలిపెట్టడం లేదు. ఎందరో పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. ఇక కామారెడ్డి జిల్లా పోలీసు శాఖలో కరోనా కలకలం రేపుతోంది. కామారెడ్డి, బాన్సువాడ, నసురుల్లాబాద్‌, ఎల్లారెడ్డి, సదాశివనగర్‌, తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లలో 27 మంది సిబ్బందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. సదాశివనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆరుగురు, నసురుల్లాబాద్‌ స్టేషన్‌లో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. ఇక సోమవారం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి 120 మంది సిబ్బంది పరీక్షలకు వెళ్లగా, అందులో 40 మంది శాంపిళ్లను మాత్రమే సేకరించి పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. అలాగే లక్షణాలు ఉన్న వారు, పాజిటివ్‌ వచ్చినవారి కుటుంబ సభ్యుల శాంపిళ్లను సైతం సేకరిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదారు రోజుల నుంచి కాస్త కేసులు తగ్గుముఖం పట్టాయి. గతవారం రోజుల కిందట కేసులను పరిశీలిస్తే.. 1800 వరకు కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పుడు తగ్గుతూ వస్తున్నాయి.

కాగా, నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని ఏడో బెటాలియన్‌కు చెందిన ఏఆర్‌ ఎస్సై (45) మంగళవారం కరోనాతో ప్రాణాలు విడిచారు. ఈయన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి వద్ద విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనాల పరంపర కొనసాగుతోంది. ముందుగా జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు కాకపోగా, తాజా పరిస్థితులను చూస్తుంటే జిల్లాల్లో కూడా తీవ్రంగానే ఉంది. జిల్లాల్లోనే కాకుండా పల్లెటూర్లలో సైతం కరోనా కేసులు నమోదవుతున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ మెల్లమెల్లగా జిల్లాలు, మండలాలు, పల్లెటూర్లలో సైతం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు. కొందరు మాస్క్‌ లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం కారణంగా కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోకపోతే మున్ముందు మరింత ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇక మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1430 కొత్త కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 47,705 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 429 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి 36,385 మంది కోరుకోగా, 10,891 మంది యాక్టివ్‌గా ఉన్నారు.



Next Story