గజ్వేల్‌ అభివృద్ధికి మోడల్ కావాలి: సీఎం కేసీఆర్‌..!

By Newsmeter.Network  Published on  11 Dec 2019 3:54 PM IST
గజ్వేల్‌ అభివృద్ధికి మోడల్ కావాలి: సీఎం కేసీఆర్‌..!

ముఖ్యాంశాలు

  • సిద్దిపేట జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్‌
  • పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం
  • గోదావరి జలాల పండగను ఘనంగా చేసుకుందాం: కేసీఆర్‌
  • కలెక్టర్‌నే ఎమ్మెల్యే అనుకోవాలి: సీఎం కేసీఆర్‌

సిద్దిపేట: సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. బుధవారం పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గజ్వేల్‌ పట్టణంలో నిర్మించిన సమీకృత మార్కెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ మార్కెట్‌లో మొత్తం ఆరు బ్లాక్‌లు ఉన్నాయి. ఆరున్నర ఎకరాల్లో నిర్మించిన ఈ మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు, మాంసాహారం లభిస్తాయి. సూపర్‌ మార్కెట్‌తో పాటు 16 షాపులు, చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన పార్క్‌తో ఈ మార్కెట్‌ను తీర్చిదిద్దారు.

ములుగులో నిర్మించిన ఫారెస్ట్‌ కాలేజీ, రీసెర్చ్‌ కేంద్రాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫారెస్ట్‌ అధికారులతో, విద్యార్థులతో సీఎం కేసీఆర్‌ ముచ్చటించారు. సుమారు రూ.175 కోట్ల వ్యయంతో ఈ కాలేజీని నిర్మించారు. ఫారెస్ట్‌ కాలేజీలో ఎమ్మెస్సీ ఫారెస్ట్‌, బీఎస్సీ ఫారెస్ట్‌, పీహెచ్‌డీ ఫారెస్ట్‌ కోర్సులు ఉండనున్నాయి. ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులు చదువుకునేలా ఫారెస్ట్‌ కాలేజీ భవనాన్ని తీర్చిదిద్దారు. విద్యార్థులు మొక్కలపై పరిశోధనలు చేయడానికి సుమారు 200 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.

అలాగే ములుగులో నిర్మించిన ఉద్యాన యూనివర్సిటీని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఉద్యాన పంటలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటి ఏర్పాటు చేసింది. రూ.135 కోట్ల వ్యయంతో 16 ఎకరాల్లో ఉద్యాన యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. గజ్వేల్‌ పట్టణంలో రూ.19.85 కోట్లతో ఏర్పాటు చేసిన మహతి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. సీఎంతో మంత్రులు ఈటెల రాజేందర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, హరీశ్‌ రావు, శ్రీనివాస్‌గౌడ్‌లు ఉన్నారు.

ఈ సందర్భంగా గజ్వేల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. జనవరి చివరి నాటికి గజ్వేల్‌ నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు అందిస్తామన్నారు. త్వరలోనే ఇక్కడి చెరువులను నింపుతామని, గోదావరి జలాల పండగను ఘనంగా చేసుకుందామని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయడమే తన లక్ష్యమన్నారు. రాష్ట్ర ఆరోగ్య సూచిక గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని మంత్రి ఈటెల రాజేందర్‌ను కోరుతున్నానని సీఎం అన్నారు. తెలంగాణలో సాహితీ సౌరభం మహతి ఆడిటోరియమన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఇలాంటి కాంప్లెక్స్‌లు రావాలన్నారు. తను ప్రతిసారీ నియోజకవర్గానికి రావడం కుదరదని, కలెక్టర్‌నే ఎమ్మెల్యే అనుకోవాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. నియోజకవర్గంలో పెండింగ్‌ పనులు ఉండొద్దని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటి ప్రొఫైల్‌ రెడీ చేద్దామని, ఏ కుటుంబానికి ఏం చేయాలో నిర్ణయించుకుందామని సీఎం కేసీఆర్‌ అన్నారు.

గజ్వేల్‌లో ఇల్లులేని నిరుపేద ఉండకూడదన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు అందిస్తామన్నారు. అలాగే నియోజకవర్గ సమస్యలపై ఒక రోజంతా చర్చించుకుందామన్నారు.

గజ్వేల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Next Story