కేబినెట్‌ భేటీలో 'కేసీఆర్‌' కీలక నిర్ణయాలు..

By అంజి  Published on  17 Feb 2020 3:00 AM GMT
కేబినెట్‌ భేటీలో కేసీఆర్‌ కీలక నిర్ణయాలు..

హైదరాబాద్‌: పౌరసత్వంలో మతపరమైన వివక్ష తగదని కేంద్రప్రభుత్వాన్ని రాష్ట్ర కేబినెట్‌ కోరింది. అన్ని మతాలను సమానంగా చూడాలని విజ్ఞప్తి చేసింది. అలాగే సీఏఏను రద్దు చేయాలని.. రాష్ట్ర కేబినెట్‌లో తీర్మానం చేసింది. ఇందుకు సంబంధించి త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్‌ సమావేశం జరిగింది. సుధీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ మంత్రులతో చర్చించి పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 5 గంటల పాటు తెలంగాణ కేబినెట్‌ భేటీ కొనసాగింది. సమావేశంలో నిధుల సమీకరణపై తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఈ నెల 24 నుంచి 10 రోజుల పాటు పట్టణన ప్రగతి కార్యక్రమం చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి రేపు మునిసిపల్‌ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మున్సిపల్‌ కమిషనర్లో పాటు అధికారులు పాల్గొననున్నారు. ఆదివారం జరిగిన కేబినెట్‌ భేటీలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. పట్టణాలను అభివృద్ధి చేయాలని, పచ్చదనం, పారిశుద్ధ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. నగర జీవన ప్రమాణాల పెంపు దిశగా అడుగులు పడాలని ఆయన అన్నారు. రేపు జరిగే సదస్సులో పాల్గొనే వారందరినీ గజ్వేల్‌ పట్టణంలో నిర్మించిన మంసాహార, శాకహార మార్కెట్‌, శ్మాశనవాటికలను సందర్శించడానికి తీసుకెళ్లనున్నారు.

అలాగే రాజీవ్‌ స్వగృహ ఇళ్లకు కేబినెట్ లైన్‌ క్లియర్‌ చేసింది. వేలం ద్వారా విక్రయాలు జరపడానికి ఆమోదం తెలిపింది. అభయ హస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి తన్నీరు హరీశ్‌రావు అప్పగించింది. కొత్త రెవెన్యూ చట్టం, నీటిపారుదల వ్యవస్థ, కొత్త ప్రవాస విధానంతో పాటు పలు అంశాలపై కేబినెట్‌లో చర్చించారు. కాగా తెలంగాణ లోకాయుక్త చట్టంపై తీసుకోవాల్సిన ఆర్డినెన్స్‌కు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. కేబినెట్‌లో మేడారం సమ్మక్క, సారక్క జాతర ఘనంగా నిర్వహించినందుకు అధికారులకు, మంత్రులను సీఎం కేసీఆర్‌ అభినందించారు.

Next Story