తెలంగాణలో “కారు” జోరు – అమ్మకాల్లో అగ్రస్థానం

By అంజి  Published on  28 Nov 2019 6:54 AM GMT
తెలంగాణలో “కారు” జోరు – అమ్మకాల్లో అగ్రస్థానం

దేశమంతా కార్ సేల్స్ కుప్పకూలుతున్నా, తెలంగాణలో మాత్రం కార్ల అమ్మకాలు మోత మోగుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ఈ సమయంలో గతేడాది జరిగిన కార్ల అమ్మకాల కన్నా ఈ సారి చాలా ఎక్కువగా అమ్మకాలు జరిగాయని వెల్లడైంది.. గతేడాది కన్నా ఎక్కువ కార్ల రిజిస్ట్రేషన్ జరిగింది.

ఆర్ టీ ఐ తాజా గణాంకాల మేరకు జనవరి నుంచి నవంబర్ మూడో వారం వరకు దాదాపు నాలుగు లక్షల కొత్త వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఇందులో 3.11 లక్షలు ద్విచక్రవాహనాలు కాగా, మిగతా 85 వేలు నాలుగు చక్రాల వాహనాలు. ఇతర వాహనాలను కూడా కలుపుకుంటే నాలుగు లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ముంబాయిలో ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో కార్ల రిజిస్ట్రేషన్ లో ఇరవై శాతం తగ్గుదల కనిపించింది. అదే హైదరాబాద్ లో ఇదే త్రైమాసికానికి 1.03 లక్షల కొత్త వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. అంతకు ముందు జనవరి-మార్చి వ్యవధిలో 1.05 లక్షల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. 2018 లో 3.62 లక్షల ద్విచక్రవాహనాలు, 84754 నాలుగు చక్రాల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఈ ఏడాది ఇంకో నెల మిగిలి ఉంది. ఈ నెల రిజిస్ట్రేషన్లను కూడా కలుపుకుంటే కొత్త కార్ల సంఖ్య 90000 కు చేరుకుంటుందని అంచనా. ఇది గతేడాది కన్నా దాదాపు 6000 ఎక్కువ.

పెరుగుతున్న జనాభా, ఉపాధి అవకాశాల మెరుగుదల వల్లే ఈ సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోందని రవాణా ఉప సంచాలకులు సీ రమేశ్ చెబుతున్నారు. గత నాలుగేళ్లుగా హైదరాబాద్ లో కార్ల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయని ఆయన చెప్పారు. నెలకు 35000 కొత్త కార్ల రిజిస్ట్రేషన్ జరుగుతోందని ఆయన అన్నారు.

Next Story