నేటి నుంచే తెలంగాణ శాసనసభ సమావేశాలు, ఆదివారం కేబినెట్ భేటీ

Telangana Legislative Assembly session from Today.తెలంగాణ రాష్ట్ర శాస‌న స‌భ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2023 3:44 AM GMT
నేటి నుంచే తెలంగాణ శాసనసభ సమావేశాలు, ఆదివారం కేబినెట్ భేటీ

తెలంగాణ రాష్ట్ర శాస‌న స‌భ సమావేశాలు నేటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు మధ్యాహ్నం 12:10 గంటలకు అసెంబ్లీ, మండలి బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అవుతాయి. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్ర‌సంగిస్తారు. రెండేళ్ల విరామం తర్వాత బడ్జెట్ సమావేశాల తొలిరోజునే గ‌వ‌ర్న‌ర్ ప్రసంగించనున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుగుతున్న బ‌డ్జెట్ స‌మావేశాలు కావ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్‌) నుంచి భార‌త్ రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్‌)గా మారిన త‌రువాత తొలి అసెంబ్లీ స‌మావేశాలు కావ‌డంతో ఆ పార్టీ వ్యూహ‌, ప్ర‌తి వ్యూహాల‌పై అంద‌రి దృష్టి నెల‌కొని ఉంది. ఇక విప‌క్షాలు కూడా అధికార పార్టీని ఇరుకున పెట్టాల‌ని బావిస్తున్నాయి. దీంతో స‌మావేశాలు వాడీవేడిగా సాగే అవ‌కాశం ఉంది.

ఆదివారం ఉదయం 10:30 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లుల క్లియరెన్స్‌తో సహా రాష్ట్ర బడ్జెట్, ఇతర కీలక నిర్ణయాలను కేబినెట్ ఆమోదించనుంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కానుంది.

ఆర్థిక మంత్రి టి హరీశ్‌రావు సోమవారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. శాస‌న‌స‌భ‌లోఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు, మండ‌లిలో శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి బ‌డ్జెట్ ప్ర‌సంగాలు చేయ‌నున్నారు. మంగ‌ళ‌వారం స‌భ‌కు సెల‌వు. ఆ త‌రువాత నుంచి స‌మావేశాలు కొన‌సాగ‌నున్నాయి.

ఉభయ సభలు సజావుగా, విస్తృతంగా చర్చించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని కీలక అంశాలపై చర్చించేందుకు శాసనసభ్యులు తమ సహకారాన్ని అందించాలని కోరగా, ప్రజా సమస్యలపై చర్చించడానికి మరియు వారి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఉండేలా శాసనసభ్యులకు స‌మాచారం అంతా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా పోలీస్ శాఖ భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేసింది. స‌మావేశాలు జ‌రిగే రోజుల్లో ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా నూత‌న స‌చివాల‌య ప్రారంభోత్స‌వాన్ని ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌నుంది.

Next Story