తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఎన్నికలు జరగనుండడంతో కేటాయింపులు, ప్రతిపాదనలపై చర్చించారు. కేబినెట్ సమావేశం ముగియడంతో మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) నిర్వహించనున్న సభ కోసం సీఎం కేసీఆర్ బయలుదేరి వెళ్లారు.
బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలుపడంతో ఆర్థిక మంత్రి హరీశ్ రావు రేపు(సోమవారం) అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం మరుసటి రోజు మంగళవారం అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 8న బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుండగా అదే రోజు ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పనున్నారు. 9, 10, 11 తేదీల్లో పద్దుల పైన చర్చ జరగనుండగా, ఈనెల 12న ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.