2023-24 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఉదయం 10.30 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. శాసనసభలో బడ్జెట్‌ను హరీశ్‌రావు చదివి వినిపిస్తున్నారు. ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ ఆచరిస్తోందని, దేశం అనుసరిస్తోంది అంటూ బడ్జెట్ ప్రసంగాన్ని హరీశ్ రావు కొనసాగించారు.
తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ.2,90,396 కోట్లు అని మంత్రి హరీష్ రావు చెప్పారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లుగా పేర్కొన్నారు. మూలధన వ్యయం రూ.37,525 కోట్లు అని తెలిపారు. వ్యవసాయానికి రూ.26,831 కోట్లు కేటాయించారు. సభలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌పై ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన భేటీలో మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి, ఆమోదం తెలిపింది. గతేడాది మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.