తెలంగాణ కమళ దళానికి నూతన సారథి ఎవరు..?

By అంజి  Published on  23 Feb 2020 8:14 AM GMT
తెలంగాణ కమళ దళానికి నూతన సారథి ఎవరు..?

హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ సారథి ఎంపిక చివరి అంకానికి చేరింది. రానన్న నాలుగైదు రోజుల్లో కొత్త అధ్యక్షుడు ఎవరు అన్నది తేలిపోనుంది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణే మరోసారి ఈ పదవిలో కొనసాగుతారా? లేక కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అన్నది త్వరలో తెలియనుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది.

బీజేపీ జాతీయ పరిశీలకులు అనిల్‌ జైన్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కృష్ణదాస్‌ సోమవారం తెలంగాణకు రానున్నారు. వారు పార్టీ కోర్‌ కమిటీ సభ్యులతో పాటు, తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యి.. అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. అనంతరం రాష్ట్ర కొత్త అధ్యక్షుడిపై బీజేపీ జాతీయ అధిష్టానం ప్రకటన చేయనుంది. కాగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీ అధ్యక్షుడి రేసులో ముందు వరుసలో ఉన్నారు.

ఒకవైపు మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు కె.లక్ష్మణే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని ప్రచారం సాగుతోంది. అధ్యక్షుడి మార్పు అంటూ జరిగితే.. ఇద్దరు కీలక నేతల్లో ఒకరికే అధ్యక్ష పదవి దక్కుతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై రాష్ట్ర బీజేపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. డీకే అరుణ, బండి సంజయ్‌ల అనుకూల, ప్రతికూలతలపై కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్నారు. అయితే కొత్తవారికి రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇవ్వొద్దని.. పార్టీలోని ఓ వర్గం అంటోందని సమాచారం.

కొత్తవారికి అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పడం వల్ల.. వారికి క్షేత్రస్థాయిలో పార్టీపై అవగాహన ఉండదని, దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు. ఉత్తర తెలంగాణలో ముగ్గురు ఎంపీల గెలుపుతో కొంత పార్టీ బలం పుంజుకుంది. మంత్రిగా పని చేసిన డీకే అరుణకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పడం వల్ల.. పార్టీ గ్రామస్థాయి నుంచి బలోపేతం అవుతందని, అటు దక్షిణ తెలంగాణలో కూడా పార్టీ బలం పుంజుకునే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు ఉన్నాయి. అయితే కె.లక్ష్మణ్‌ను తప్పిస్తే.. అధ్యక్ష పదవిని బండి సంజయ్‌కే ఇవ్వాలని కొందరు అంటున్నారు.

పార్టీ అధ్యక్షురాలిగా డీకే అరుణను చూసేందుకు కొందరు ఇష్టపడటం లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిఫారసులను, జాతీయ నాయకత్వాన్ని పరిగణలోకి తీసుకుంటే బండి సంజయ్‌కే అవకాశాలు ఎక్కువని ఆ పార్టీ నేత ఒకరు చెప్పారని ప్రముఖ దినపత్రిక తెలిపింది. పార్టీ కోసం చిత్తుశుద్ధితో పనిచేస్తే కార్యకర్తగా బండి సంజయ్‌కు మాంచి గుర్తింపు ఉంది. యువతలో ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉంటే మరోసారి లక్ష్మణ్‌నే అధ్యక్ష పదవిలో కొనసాగించే అవకాశాలు లేకపోలేదని పార్టీ నేతలు అంటున్నారు.

Next Story