సీఈఓలకు చుక్కలు చూపించిన అమెరికా ప్రజాప్రతినిధులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 July 2020 11:08 AM GMTఅమెజాన్, యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలను అమెరికా ప్రజాప్రతినిధుల నుండి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. మార్కెట్‌లో ఆధిపత్యం కోసం ఆ కంపెనీలు అనుసరించిన వ్యూహాల్ని హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్యానెల్ నిలదీసింది. డెమొక్రాట్లు, రిపబ్లికన్ల నుంచి ఎదురైన ప్రశ్నలకు టెక్ దిగ్గజాలకు ఊపిరి ఆడలేదు. అమెరికన్ కాంగ్రెస్‌లో జ్యుడిషియరీ కమిటీ ఎదుట బుధవారం విచారణకు అమెజాన్ సీఈవో జెఫ్ బేజోస్, యాపిల్ సీఈవో టిమ్‌కుక్, ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌లు హాజరయ్యారు.
ప్యానల్‌లో 15 మంది సభ్యులు ఉండగా.. సుమారు 5 గంటల పాటు ఆ నలుగుర్నీ ప్రశ్నించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరిగింది. నలుగురు దిగ్గజ టెక్ అధినేతలు ఒకేసారి చట్టసభ సభ్యుల ముందు విచారణకు హాజరవడం ఇదే తొలిసారి. డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ వేదికలు, సోషల్ మీడియా ద్వారా విద్వేషం, హింసపూరిత వాతావరణం పెరిగిపోతుందన్న ఆరోపణల నేపథ్యంలో టెక్ దిగ్గజాలు అమెరికన్ సెనేట్ విచారణ కమిటీ ఎదుట హాజరయ్యారు.
5 లక్షల కోట్ల డాలర్ల ఉమ్మడి మార్కెట్ విలువను కలిగిన ఈ దిగ్గజాలు మార్కెట్ వాటా కోసం చిన్న సంస్ధలను దారుణంగా తొక్కివేస్తున్నాయని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు టెక్ సీఈఓలపై మాటల దాడికి దిగారు. తీవ్ర ఆరోపణలు, ప్రశ్నలు ఎదురవ్వడంతో వీటన్నింటినీ సమీక్షించి తిరిగి సభకు వివరిస్తానని పిచాయ్ ప్యానల్ సభ్యులకు తెలిపారు. గూగుల్ కంటెంట్ చోరీకి పాల్పడుతోందని డెమొక్రాట్, యాంటీ ట్రస్ట్ సబ్‌కమిటీ చీఫ్ డేవిడ్ సిసిలిన్ సుందర్ పిచాయ్‌ను నిలదీశారు. యెల్ప్ ఇంక్ నుంచి గూగుల్ రివ్యూలను దొంగిలించడమే కాకుండా, గూగుల్ సంస్థ బెదిరిస్తోందని ఆరోపణలు వచ్చాయి. వీటిపై తాను తెలుసుకోవాలనుకుంటున్నానని పిచాయ్ సమాధానం ఇచ్చారు. యూజర్ల కోసం గూగుల్ కంటెంట్ చోరీకి పాల్పడుతుందనే ఆరోపణలతో తాను ఒప్పుకోనని చెప్పేశారు సుందర్ పిచాయ్.
ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ ను కూడా ప్రశ్నల మీద ప్రశ్నలతో ప్యానల్ బృందం ఇరుకున పెట్టడానికి చూసింది. ఫేస్‌బుక్ తన ప్రత్యర్ధులను ఏయే సందర్భాల్లో అనుకరించిందని మరో ప్రతినిధి ప్రమీలా జయపాల్ జుకర్‌బర్గ్‌ను అడగ్గా ఇతరుల ముందుకెళ్లిన ఫీచర్లు కొన్నింటిని తాము అనుసరించిన సందర్భాలున్నాయని ఒప్పుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ను జూకర్ బర్గ్ కొన్న సంగతి తెలిసిందే..! ఇన్‌స్టాగ్రామ్ పోటీగా మారుతుందనే ఆందోళనతోనే దాన్ని కొనుగోలు చేశారా అని ప్రతినిధులు జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించారు. తాము ఇన్‌స్టాగ్రామ్‌ను కొనుగోలు చేసిన సమయంలో అది ఓ చిన్న ఫోటో షేరింగ్ యాప్ మాత్రమేనని.. ఈ ఒప్పందాన్ని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ సమీక్షించిందని తెలిపారు.
తొలి సారిగా ఈ మీటింగ్‌కు హాజరైన అమెజాన్ సీఈవో జెఫ్ బేజోస్ ను విచారణ కమిటీ అమెరికా కంపెనీల సాంకేతికత, సమాచారాన్ని చైనా ప్రభుత్వం చోరీ చేస్తుందా అని ప్రశ్నించగా ఆయన నుంచి స్పందన రాలేదు. రిపబ్లికన్ గ్రెగ్ స్ట్రేబ్.. ‘‘మిస్టర్ బెజోస్.. మీరు మ్యూట్‌లో ఉన్నారు’’అంటూ బెజోస్‌కు గుర్తు చేశారు. దీంతో వెంటనే తేరుకున్న బెజోస్.. అన్‌మ్యూట్ చేశారు. కొన్ని ఖరీదైన వస్తువులకు సంబంధించిన నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారని తెలుసునని.. ఇందులో చైనా ప్రభుత్వ ప్రమేయం ఉందో లేదో తెలియదన్నారు.