కొత్త ఏడాదిలో తొలి టైటిల్ సాధించిన టీమిండియా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Jan 2020 11:15 PM IST
చివరి టీ20లో శ్రీలంకపై టీమిండియా విజయం సాధించింది. శ్రీలంకను 15.5 ఓవర్లలో 123 పరుగులకే కట్టడి చేసిన భారత్ 78 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో టీమిండియా సిరీస్‌ను 2-0 తేడాతో దక్కించుకుంది. మొదటి టీ20 మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, రెండో టీ20లో భారత్ విజయం సాధించింది.
టాస్ గెలిచిన శ్రీలంక.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 202 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(52), కేఎల్ రాహుల్(54)లు అర్థ సెంచరీలతో రాణించారు. చివర్లో మనీష్ పాండే(31 నాటౌట్; 18 బంతుల్లో 4 ఫోర్లు), శార్దూల్ ఠాకూర్(22 నాటౌట్;8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడగా ఆడారు.
అనంతరం చేధనకు దిగిన శ్రీలంక జట్టులో ధనుంజయ డిసిల్వా(57), ఏంజెలో మాథ్యూస్ (31)లు మాత్రమే రాణించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దాంతో శ్రీలంక ఓటమి పాలయ్యింది. టీమిండియా బౌలర్లలో సైనీ మూడు వికెట్లు సాధించగా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్‌లు తలా రెండు వికెట్లు తీశారు.