రైతు పరిస్థితి ''అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి''
By రాణి Published on 10 Dec 2019 11:27 AM ISTఅమరావతి : ఏపీ సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నిరసన చేపట్టింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఆందోళన చేశారు. వరి కంకులు, పత్తి, మొక్కజొన్న పొత్తులతో నిరసన ప్రదర్శన చేస్తూ ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు వారి సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి మాదిరిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్న పండించిన పంటలను కొనే నాథులే లేరని, దిగుబడి తగ్గినా ఎవరూ కొనేందుకు ముందుకు రావడం లేదని వాపోయారు. వేరుశెనగ, పామాయిల్, శనగ, పసుపు, పత్తి రైతులు కష్టాల్లో ఉన్నారని, వారికి గిట్టుబాటు ధర చెల్లించాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..రైతు సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తామన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తూనే ఉందని అచ్చెన్న దుయ్యబట్టారు.
సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమానికి ముందు పార్టీ నేతలు, వ్యూహ కర్తలతో చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పార్టీ నేతలతో రైతు సమస్యలపై, వాటి పరిష్కారంపై, ప్రభుత్వ వైఖరిపై చర్చించారు. రాష్ర్టంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏ మాత్రం శ్రద్ధ లేదని విమర్శించారు. జగన్ దృష్టి ఎంతసేపు తెదేపాను ఎలా దెబ్బతీయాలన్న దానిపైనే ఉంటుంది తప్ప రాష్ర్టాన్ని సమస్యల నుంచి ఎలా గట్టెక్కించాలన్న దానిపై చేయడం లేదన్నారు. పేదల తరపున పోరాడటమే టీడీపీ చేస్తున్న నేరమా ? లేకపోతే ఉల్లి ధరల తగ్గించాలని డిమాండ్ చేయడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలంతా కలిసి ప్రజలను భయపెడుతున్నారని యద్దేవా చేశారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా చూసుకునేందుకు గ్రామ వాలంటీర్లను నియమించారు. అలాంటప్పుడు ఇంత ఉల్లి కొరత ఉన్నపుడు వాటిని డోర్ డెలివరి ఇవ్వలేకపోతే గ్రామ వాలంటీర్లు ఎందుకు? వారికి జీతాలెందుకు ఇస్తున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పరుస్తున్న కృత్రిమ కొరతతో ప్రజలు చాలా ఇబ్బందులెదుర్కొంటున్నారని, త్వరలో ఈ కొరతకు స్వస్తి చెప్పకపోతే పోరాటం ఉధృతం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.