పులివెందుల పులి అలా చేస్తుందా..!

By అంజి  Published on  19 Jan 2020 3:37 PM GMT
పులివెందుల పులి అలా చేస్తుందా..!

అమరావతి: సీఎం జగన్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. డమ్మీ కాన్వాయ్‌తో ట్రయల్‌ రన్‌ సిగ్గుచేటన్నారు. రియల్‌ ఎస్టేట్‌ పెరగకుండా అమరావతిని చంపేయాలని చూస్తున్నారని దేవినేని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సీఏం జగన్‌ ఒప్పందం చేసుకున్నారని విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను జగన్‌ వ్యతిరేస్తున్నారని దేవినేని మండిపడ్డారు. అమరావతిలో రైతుల ఉద్యమాన్ని చూసి సీఎం జగన్‌కు వెన్నులో వణుకు పుట్టిందని, అందుకే అసెంబ్లీ సమావేశాల కోసం భారీ భద్రతను ఏర్పాటు చేయించారని అన్నారు. పులి వెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో ట్రయల్‌ రన్‌ చేయించుకోవడం సిగ్గుచేటన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమా మాట్లాడారు.

రేపు అసెంబ్లీని ముట్టడించి తీరుతామని ఆయన అన్నారు. పోలీసులు సెక్షన్‌ 149 కింద నోటిసులిచ్చారని, అయిన అసెంబ్లీ ముట్టడి ఖాయమన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియాజేయాలన్నారు. అమరావతిలో భారీగా బలగాలను మోహరించడం పట్ల దేవినేని మండిపడ్డారు. జగన్‌ తప్పు చేశారని.. అందుకే ఇంతలా భయపడుతున్నారని పేర్కొన్నారు. వైజాగ్‌లో ప్రజాబ్యాలెట్‌ను ప్రభుత్వం అడ్డుకుందన్నారు. అమరావతి పరిసర ప్రాంతాల ఎమ్మెల్యేలు మూడు రాజధానులకు మద్దతు పలకడం సిగ్గుమాలని చర్య అని దేవినేని ఉమా చెప్పుకొచ్చారు. విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి సారథ్యంలో 52 వేల ఎకరాల భూములు చేతులు మారయని, అందుకే అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని జగన్‌ కలలు కంటున్నారని ఆరోపించారు. అమరావతిలో భూములను కొనుగోలు చేయడానికి యత్నించి విఫలమయ్యారని అందుకే వైజాగ్‌ను తెరపైకి తెచ్చారన్నారు.

Next Story