హైదరాబాద్ లోని ఆ పోలీస్ స్టేషన్ ఇప్పుడు హడల్
By సుభాష్ Published on 22 Jun 2020 6:30 AM GMTహైదరాబాద్ లో ఏళ్ల తరబడి ఉంటున్నా.. చాలామందికి చాలా ప్రాంతాలు తెలుసు. ఎందుకంటే మహానగరం అంత పెద్దది. వేల కిలోమీటర్ల విస్తీర్ణానికి వ్యాపించిన నగరంలో తామున్న ప్రాంతం.. దాని చుట్టుపక్కల ప్రాంతాల మీద అవగాహనే తప్పించి.. నగరంలోని అన్ని ప్రాంతాల మీద అవగాహన ఉన్న వారు చాలా తక్కువగా కనిపిస్తారు. ఈ మాటల్లో నిజం లేదనుకుంటే.. ‘‘టప్పచబుత్ర’’ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఎవరినైనా అడగండి? అంత దాకా ఎందుకు ఆ పోలీస్ స్టేషన్ పేరు ఎప్పుడైనా విన్నారా? అని అడిగినా విషయం ఇట్టే అర్థమైపోతుంది.
చాలా తక్కువమందికి మాత్రమే తెలిసిన ఈ పోలీస్ స్టేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాయదారి వైరస్ ఆ స్టేషన్ లోని సిబ్బందికి వ్యాపించటం.. పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదు కావటంతో పోలీసు శాఖలో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ మహానగరం మొత్తం మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉంటుంది. హైదరాబాద్.. సైబరాబాద్.. రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉన్న నగర పోలీసుల్లో దగ్గర దగ్గర 170 మంది వరకు పాజిటివ్ బారిన పడినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ నగరానికి చెందిన నలుగురు పోలీసులు మహమ్మారి కారణంగా మరణించినట్లు చెబుతున్నారు.
ఇప్పటివరకూ మరణించిన నలుగురు పోలీసుల్లో హెడ్ కానిస్టేబుళ్లు ఇద్దరు అయితే.. మరో ఇద్దరిలో ఒకరు కానిస్టేబుల్ కాగా.. మరొకరు హోంగార్డు. ఇలా కేసులతో పాటు.. మరణాలు చోటు చేసుకోవటంపై పోలీసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే..టప్పచబుద్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని మొత్తం సిబ్బందిలో పన్నెండు మందికి పాజిటివ్ గా తేలటం ఇప్పుడు సంచనలంగా మారింది. ఇటీవల కాలంలో పోలీసులకు పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్న వేళ.. ముందస్తు జాగ్రత్తగా ఆ స్టేషన్ లోని సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదు కావటంతో.. మిగిలిన పోలీస్ స్టేషన్లలోని పోలీసులకు కొత్త గుబులు పట్టుకుంది. తమ స్టేషన్లలో కూడా ఇదేతీరులో పరీక్షలు నిర్వహిస్తే మరెన్ని కేసులు నమోదవుతాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రోజులో పెద్ద ఎత్తున పాజిటివ్ లు రావటంతో టప్పచబుద్ర పోలీస్ స్టేషన్ ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది.