పిల్లల ఆకలి తీర్చేందుకు రూ. 150లకు తన జుట్టును అమ్మేసిన తల్లి
By సుభాష్ Published on 13 Jan 2020 7:34 PM IST
ముఖ్యాంశాలు
పిల్లలను బతికించలేక ఆత్మహత్యాయత్నం
ఓ ఫేస్ బుక్ పోస్టు వల్ల గట్టెక్కిన ఆమె జీవితం
ఫేస్ బుక్ పోస్టును చూసి లక్షా 45 వేల విరాళం
దేవుడి తర్వాత జన్మనిచ్చిన తల్లే అంటుంటారు. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మతనాన్ని ఎంత పొగిడినా.. ఎంత వర్ణించినా తక్కువే. ఎందుకంటే అమ్మ అనే పేరుకు అంత ప్రాముఖ్యత ఉంది మరి. అపారమైన ప్రేమ అమ్మ సొంతం. బతికున్నన్ని రోజులు తన సంతోషాలను పిల్లలకే దారపోస్తుంటుంది. పిల్లల ఆనందమే కోరుకుంటుంది అమ్మ. పిల్లలకు ఏదైన ఇబ్బందులొచ్చినా.. తల్లిడిల్లేది అమ్మే. నవ మాసాలు మోసి ప్రాణం పోసిన మాతృమూర్తులు. అవసరమైతే పిల్లలకు ఏదైన ఆపద వస్తే తన ప్రాణాలను సైతం అడ్డం పెడుతుంది. ఇక ఓ పేద తల్లి పడ్డ కష్టాల గురించి తెలిస్తే అయ్యో పాపం అనక మానరు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రేమ (30) అనే మహిళ భర్త ఏడు నెలల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు. పిల్లలు చిన్నతనంలో ఉండగానే తండ్రి దూరం కావడంతో పిల్లల భారం తల్లిపై పడింది. పిల్లలను పోషించడం భారంగా మారింది. ఎవరికి చేయి చాచినా ఒక్కపైసా కూడా పుట్టకుండాపోయింది. బంధువులున్నా ఎవ్వరు కూడా పట్టించుకోకపోవడంతో ఆమె జీవితం ధీనంగా తయారైంది. పిల్లలను పెంచి పోషించుకునేందుకు ఇంట్లో ఉన్న ఒక్కో వస్తువులను అమ్ముకుంటూ ఇన్నాళ్లు పిల్లల ఆకలి తీర్చింది. ఇక పిల్లలు తినేందుకు తిండి కూడా సరిగ్గా లేకపోవడంతో చివరకు పిల్లలతోపాటు ఆమె రోడ్డెక్కాల్సి వచ్చింది. ఎటు దిక్కులేని పరిస్థితుల్లో కనిపించిన వ్యక్తిని సాయం అడిగింది. సవరం కోసం తన జుట్టును ఇస్తే రూ. 150 ఇస్తానని ఆ వ్యక్తి చెప్పడంతో మరుక్షణం ఆలోచించకుండా ఆమె గుండు చేయించుకుంది. దీంతో వచ్చిన డబ్బులతో పిల్లల కడుపు నింపింది. వచ్చిన డబ్బులతో పిల్లల కడుపు ఎన్ని రోజులు నింపేదని ఆందోళనలో పడిపోయింది ఆ మహిళ. ఇక పిల్లలకు అన్నం పెట్టలేని తాను ఈ సమాజంలో బతకడం వ్యర్థమని, చనిపోవడమే సరైందని నిర్ణయించుకుంది. ఒక సమయంలో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఆమె సోదరి అడ్డుపడటంతో బతికి బయట పడింది. విధి ఆమె చావుకు అడ్డు పడింది. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినా విఫలమైంది.
ఇక చివరకు జి బాలా అనే గ్రాఫిక్ డిజైనర్‌కు ఆమె బతుకులు కంటపడ్డాయి. వెంటనే ఆయన ఫేస్ బుక్ లో ఆమె జీవిత వ్యధను పోస్టు చేసి సాయం చేయమని విజ్ఞప్తి చేశాడు. ఈ పోస్టును చూసి కొందరు స్పందించి ఆర్థిక సాయం చేశారు. అందరి ఆర్థిక సాయంతో లక్షా 45 వేల నగదు సమకూరాయి. మరో వ్యక్తి ఇటుకల బట్టిలో పని కల్పించాడు. డబ్బు కొందరికి అవసరం కావచ్చేమో..కానీ కొందరికి మాత్రం అది జీవితమనే చెప్పాలి. ఇక సదరు ఫేస్ బుక్ పోస్టు అధికారుల్లోనూ చలనం కలిగించింది. రూ. 25వేల ఆర్థిక సాయంతో పాటు రేషన్ కార్డు కూడా అందించారు. ఇక ప్రతినెల వితంతు పెన్షన్ కూడా ఇస్తామని తెలిపారు. ఇప్పుడు ఆమె బిడ్డల్ని ఎంచక్కా చదివించుకుంటోంది. ఇలాంటి జీవితాలు దేశంలో చాలానే ఉన్నాయి. చావు అనేది మన చేతుల్లో ఉండదు. ఎప్పుడు పోవాలని ఉంటే అప్పుడే వెళ్లిపోతుంది. చనిపోయేందుకు ఎంత ప్రయత్నించినా విధిరాసి ఉంటే బతికి బయట పడతాం. కొందరు జీవితంపై విరక్తి చెంది పైలోకాలకు వెళ్లిపోతుంటే.. ఇలాంటి వారికి ఎవరో ఒకరి సాయం వల్ల మళ్లీ జీవితం యధావిధిగా కొనసాగుతుంది. సదరు వ్యక్తి ఫేస్ బుక్ పోస్టు ద్వారా ఆర్థిక సాయం అందడంతో ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.