బాలినేనిని వదలని ఎంపీ రామ్మోహన నాయుడు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 July 2020 11:10 AM GMTజులై 15 తమిళనాడులో వైసీపీ ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించిన కారులో రూ.5.7 కోట్ల నగదు పట్టుపడటం, అది మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ద్వారా హవాలా కోసం పంపిన బ్లాక్ మనీ అని విపక్ష నేతలు ఆరోపించారు. టీడీపీ ఎంపీ కె.రామ్మోహన నాయుడు ఫిర్యాదును స్వీకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రాథమిక మొదలుపెట్టింది. మనీ లాండరింగ్ పాల్పడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు.
తమిళనాడులో పట్టుబడ్డ సొమ్ము తమదేనంటూ ఒంగోలు బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు ఒప్పుకున్నారు. లాక్ డౌన్ కారణంగా కారణంగా వ్యాపారం సరిగ్గా లేకపోవటంతో డబ్బు తమతో ఉన్నట్లు తెలిపారు. సరైన పత్రాలు చూపించి, డబ్బు తీసుకుంటామని కోద్దిరోజుల కిందటే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్ పట్టుబడింది చాలా చిన్న మొత్తం అని చెప్పుకొచ్చారు. మొత్తం 1200 కోట్ల నల్లడబ్బు హవాలా ద్వారా మారిషస్ కు చేరిందని ఆరోపించారు. చెన్నై, బెంగళూరు నగరాల మీదుగా హవాలా వ్యవహారం నడిచిందంటూ పలు ట్వీట్లు చేశారు. వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
ఈ ఆరోపణలపై బాలినేని స్పందించారు. టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం మానుకోవాలని… ఆ డబ్బు నాదని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం అని ప్రకటించారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన నాయకులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్‌కు నన్ను విమర్శించే స్థాయి లేదన్న ఆయన... నా పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. నేను తలచుకుంటే ప్రకాశం జిల్లాలో టీడీపీ లేకుండా చేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి బాలినేని. టీడీపీ నేతలు నన్ను రాజకీయంగా టార్గెట్ చేశారని అన్నారు బాలినేని.
నల్లమల్లి బాలును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ప్రశ్నించి, అతడి ఇంటిలో సోదాలు నిర్వహించారు. అతడికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.