తమన్నా.. ఇంకో అడుగు కిందికి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 July 2020 12:01 PM GMT
తమన్నా.. ఇంకో అడుగు కిందికి

హీరోలు ఒకసారి స్టార్ స్టేటస్ సంపాదించాక దశాబ్దాల పాటు అలాగే కొనసాగుతారు. ఫ్లాపులు వచ్చినా తట్టుకుంటారు. ఒక రేంజ్ సినిమాలే చేస్తారు. కానీ హీరోయిన్ల కథ ఇలా ఉండదు. వాళ్లు హీరోల్లా ఏళ్లకు ఏళ్లు ఒక స్థాయి మెయింటైన్ చేయడం అంటే కష్టమే. వాళ్ల కెరీర్లో పీక్స్ అనేది ఒక ఐదారేళ్లకు మించి సాగదు.

కొందరు హీరోయిన్లు మాత్రం అటు ఇటుగా పదేళ్ల పాటు స్టార్ స్టేటస్ అనుభవిస్తారు. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు అడుగులేస్తారు. రేంజ్ తగ్గించుకుని చిన్న, మీడియం రేంజ్ సినిమాలు చేస్తారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఒకప్పుడు అగ్ర కథానాయకులతోనే సినిమాలు చేసిన ఆమె.. గత కొన్నేళ్లలో కళ్యాణ్ రామ్, సందీప్ కిషన్ లాంటి మీడియం రేంజ్ హీరోలతో నటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు తమ్మూ ఇంకో అడుగు కిందికి దిగి సత్యదేవ్‌కు జోడీగా నటించడానికి ఓకే చెప్పింది. వీళ్ల కలయికలో ఒక రొమాంటిక్ కామెడీ రాబోతోంది. కన్నడలో విజయవంతం అయిన ‘లవ్ మాక్‌టైల్’ సినిమాను తెలుగులో సత్యదేవ్-తమన్నా జంటగా తెరకెక్కించనున్నారు.

ఈ చిత్రాన్ని నాగశేఖర్ అనే కొత్త దర్శకుడు రూపొందించనున్నాడు. అతడితో కలిసి భావన రవి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చనున్నాడు. సత్యదేవ్‌కు సరైన హిట్ పడలేదు కానీ.. లేకుంటే నానిలా మంచి రేంజ్ అందుకోవాల్సిన వాడే. టాలెంట్ విషయంలో అతను ఎవరికీ తీసిపోడు. అతడి ప్రతిభను నమ్మి తమన్నా తనతో జోడీ కట్టడానికి ఒప్పుకోవడం విశేషమే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.

Next Story