డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించిన తలసాని, భట్టి.. ఏమన్నారంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Sept 2020 2:59 PM ISTఅసెంబ్లీ వేదికగా డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మధ్య వాడివేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరూ నేతలు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు, హైదరాబాద్ అభివృద్ధిని చూపాలని మంత్రికి.. భట్టి సవాల్ విసిరారు. ఇందుకు స్పందించిన మంత్రి తలసాని.. భట్టి విక్రమార్కని తీసుకెళ్లి చూపిస్తానన్నారు.
ఈ క్రమంలోనే సీఎల్పీ నేత భట్టీ సవాల్ స్వీకరించిన మంత్రి గురువారం ఉదయం ఆయన ఇంటికి చేరుకున్నారు. మంత్రి వెంట జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తదితరులు ఉన్నారు. ఇక భట్టి ఇంటి నుంచి డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించేందుకు జియాగూడకు తలసాని, భట్టి విక్రమార్క ఒకే కారులో బయల్దేరివెళ్లారు.
వారివురు కలిసి నాంపల్లిలోని కట్టెలమండి ప్రాంతంలో 120, జియాగూడలో 800, గోడెకబర్‌లో 190 మొత్తం వెయ్యి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఐమాక్స్ ప్రాంతం, సీసీనగర్, కొల్లూరు, అంబేద్కర్ నగర్ ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇప్పటివరకూ వీరు మొత్తం 3428 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఇక.. శుక్రవారం కూడా వీరు మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇప్పటివరకూ 3428 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మాత్రమే పరిశీలించామని.. ఇళ్ల నాణ్యతపై ఇంజనీరింగ్ నిపుణులు తనిఖీలు చేస్తున్నారని అన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. హైద్రాబాద్ పట్టణంలోని 60 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామని.. లక్ష ఇళ్లు చూపించేవరకు కూడ తాను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెంటే తిరుగుతానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువురు నేతలకు భద్రత పెంచారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.