ఆస్పత్రిలో తబ్లిగి జమాత్ సిబ్బంది అసభ్యప్రవర్తన.. కేసు నమోదు
By Newsmeter.Network
కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి శతవిధాల ప్రయత్నిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని భావిస్తున్న తరుణంలో ఢిల్లిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మత ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి అధికశాతం కరోనా వైరస్ భారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వారిని గుర్తించి ఐసోలేషన్ కేంద్రాలకు తురలిస్తుంది. ఇప్పటికే ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారు పలువురు చికిత్స పొందుతూ మృతి చెందారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి మతస్తులు ఈ ప్రార్థనల్లో పాల్గొనడంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
Also Read :కరోనాపై పోరులో.. వైద్యుల రక్షణకు బయోసూట్
ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్‌లోని తబ్లిగి జమాత్ సభ్యులకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఘజియాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా జమాత్ సభ్యులు కొందరు ఆస్పత్రి ఐసోలేషన్ వార్డు పరిసరాల్లో అర్థనగ్నంగా తిరగడం, నర్సింగ్ సిబ్బంది సమీపంలో అసభ్యకరంగా పాటలు పాడటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీనికితోడు తమకు పొగాకు, సిగరేట్లు కావాలని కొందరు డిమాండ్ చేసినట్లు ఆస్పత్రి సిబ్బంది చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం విషయాన్ని చీఫ్ మెడికల్ ఆఫీసర్ జిల్లా ఎస్పీ, మెజిస్ట్రేట్‌ల దృష్టికి లిఖిత పూర్వకంగా తీసుకెళ్లారు.
Also Read :రూ. 1.25 కోట్ల విరాళం అందజేసిన బాలయ్య
దీంతో పోలీసులు పలువురి తబ్లిగి జమాత్ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఘజియాబాద్ ఎస్పీ కళానిధి నైతాని మాట్లాడుతూ.. స్త్రీల పట్ల అవమానకర ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, అంటు వ్యాధులు వ్యాపించే విధంగా ప్రవర్తించి తద్వారా ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించడం వంటి నేరాలకు పాల్పడినందుకు కొందరు తబ్లిగి సభ్యులపై కేసు నమోదు చేశామని తెలిపారు. సంఘటనపై అదనపు జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ స్థాయి అధికారులు విచారణ చేపట్టారని, ఏ విధమైన చెడుప్రవర్తన చేసినా సహించబోమని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.