టీ20 ప్రపంచకప్ వాయిదా..!
By తోట వంశీ కుమార్ Published on 27 May 2020 11:14 AM GMTకరోనా వైరస్ ముప్పుతో క్రీడారంగం కుదేలైంది. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్- నవంబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఐసీసీ గురువారం (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) సభ్య దేశాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనుంది.
ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచ కప్‌ను 2022కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీని కోసం కొత్త షెడ్యూల్‌ను తయారు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 2021లో ఇండియాలో టీ20 వరల్డ్‌కప్ జరగాల్సిన ఉన్నది. అయితే ఆ టోర్నీని యథావిధిగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టోర్నీని మాత్రం 2022కు వాయిదా వేశారు. ఇక 50 ఓవర్లలో వరల్డ్‌కప్ టోర్నీని మాత్రం 2023లో ఇండియాలో నిర్వహించనున్నారు.
రెండు మెగా టోర్నీలను 6 నెలల సమయంలో నిర్వహించేందుకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితి అనుకూలంగా లేదని ఐసీసీ బావిస్తోంది. టోర్నీని రద్దు చేస్తే పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తోందని, అందుకనే వాయిదా వేయడమే మంచిదనే అభిప్రాయం ఐసీసీ వ్యక్తం చేసింది. ఒకవేళ టీ20 ప్రపంచ కప్ వాయిదా పడితే.. ఈ ఏడాది ఐపీఎల్‌కు మార్గం సుగమం అయినట్లే. టీ20 ప్రపంచ కప్ నిర్వహించాల్సిన అక్టోబర్-నవంబర్ నెలలో ఐపీఎల్ నిర్వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
టీ20 వరల్డ్‌కప్ వాయిదాపై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదని ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఈ ఈవెంట్ కోసం ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆ ప్రతినిధి వెల్లడించారు. రేపు జరగనున్న ఐసీసీ బోర్డు సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.