టీ20 ప్రపంచకప్ డౌటే..
By తోట వంశీ కుమార్ Published on 27 April 2020 8:47 PM ISTకరోనా వైరస్ ముప్పుతో క్రీడారంగం కుదేలైంది. ఇప్పటికే పలు క్రీడాటోర్నీలు వాయిదా పడగా.. చాలా టోర్నీలు రద్దు అయ్యాయి. దీంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక మహమ్మారి ముప్పుతో మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిరవధికంగా వాయిదా పడిందన సంగతి తెలిసిందే. ఇప్పుడు క్రికెట్ ప్రేమికులు అందరి చూపు ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ లో జరిగే టీ20 ప్రపంచకప్ పై పడింది. కాగా ఈ టోర్నీపై కూడా ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్ నిర్వహించడం అసాధ్యమని బీసీసీఐ(భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) కు చెందిన ఓ అధికారి తెలిపారు.
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. కొందరు జూన్‌లో పరిస్థితి అదుపులోకి వస్తుందని అంటుండగా.. మరికొందరు ఇంకా కొన్ని రోజుల సమయం పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభం నుంచి ఎప్పుడు బయటపడుతామో స్పష్టత లేదన్నారు. ప్రయాణాలు మొదలయ్యాక కరోనా తీవ్రత ఎలా ఉంటుందో ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.
ప్రస్తుత సమస్య కేవలం టోర్నీకి ఆతిథ్యమిచ్చే సీఏది మాత్రమే కాదు. అలా అని ఐసీసీ కూడా రిస్క్ తీసుకుంటుందని అనుకోవడం లేదు. టోర్నీ నిర్వహణ నిర్ణయం సీఏ, ఐసీసీలది అయితే కాదని, ప్రభుత్వాల చేతుల్లో ఉందన్నారు. ప్రపంచకప్ నిర్వహించే రిస్క్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకుంటుందా..? ఆస్ట్రేలియాలో సెప్టెంబర్ 30 వరకు పర్యాటక వీసాలను రద్దు చేశారు. మరీ ఆటగాళ్లు సన్నద్దమవ్వడానికి సమయం సరిపోతుందా..? ఇతర బోర్టులు దీనికి అంగీకరిస్తాయా అని ప్రశ్నించారు. ఒకవేళ నిర్వహించినా.. ఎంత మంది ప్రేక్షకులు వస్తారు అనేది తెలియది.. పది సీట్లకు ఒక్కరి కూర్చోబెట్టి మ్యాచ్‌లను నిర్వహించడం సాధ్యం కాదన్నారు. ఇక ప్రపంచకప్‌ను నిర్వహించడానిని సాధ్యమైంత మేరకు ప్రయత్నిస్తామని ఇప్పటకే క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఖాళీ స్టేడియంలో మ్యాచ్‌లను పలువురు క్రికెటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతానికి వరల్డ్ కప్ వాయిదా తప్ప మరో మార్గం లేదని, ఒకవేళ మ్యాచులను నిర్వహించినా.. షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం కష్టమన్నారు.