టీమ్ఇండియా రాకపోతే.. ఆర్థికంగా నష్టపోతాం
By తోట వంశీ కుమార్ Published on 27 April 2020 11:25 AM GMTకరోనా వైరస్ దెబ్బతో క్రీడారంగ్ కుదేలైంది. పలు టోర్నీలు వాయిదా పడగా.. చాలా టోర్నీలు రద్దు అయ్యాయి. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి చాలా దేశాలు లాక్‌డౌన్ ను విధించాయి. ఇక ఆస్ట్రేలియా ప్రభుత్వం అయితే.. ఏకంగా ఆరు నెలల పాటు విదేశీయులకు అనుమతి నిషేదించింది. ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్‌లు జరగక ఆయా క్రికెట్ బోర్డులు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ప్రపంచ ధనిక క్రికెట్ బోర్డుల్లో ఒకటైన సీఏ(ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు) పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ఆటగాళ్లకు కనీసం జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంది. ఈ ఇబ్బందుల నుంచి గట్టేందుకు .. ఆటగాళ్ల జీతాల్లో కోత విధించడంతో పాటు సిబ్బందిని తొలగించడానికి సిద్దమైంది. ఇక ఇప్పటికే ఏప్రిల్ 27 నుంచి జూన్ 30 వరకు ఉద్యోగుల, కాంట్రాక్టర్ల జీతాల్లో 80 శాతం కోత విధించనుంది.
సీఏ ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉందని అంటున్నాడు ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టీమ్ ఫైన్. టీమ్ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటనకు వస్తే ఆర్థిక కష్టాల నుంచి సీఏ గట్టెక్కుతుందని అభిప్రాయ పడ్డాడు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచకప్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక ఈ ఏడాది చివర్లో టీమ్ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ పర్యటన గనుక సజావుగా సాగితే.. క్రికెట్ ఆస్ట్రేలియా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతుందని ఫైన్ ఆశాబావాన్ని వ్యక్తం చేశాడు. ఒక వేళ సిరీస్ జరగక పోతూ.. 250 నుంచి 300 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లనుందని అన్నాడు. ఇదే గనుక జరిగితే.. ఇప్పట్లో కోలుకోవడం కష్టమన్నాడు. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వంతో సీఏ చర్చలు జరుపుతోందన్నాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కొన్ని ఆంక్షల్ని సడలిస్తే.. టీమ్ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించడానికి ఎలాంటి అవాంతరాలు ఉండవని, సీఏ కూడా ఆటగాళ్ల భద్రత కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోందన్నాడు.