వాంఖడే వరదలో కొట్టుకుపోయిన రికార్డులు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Dec 2019 4:46 PM ISTటీమిండియా, విండీస్ జట్ల మధ్య వాంఖడే వేదికగా జరిగిన చివరిదైన మూడో టీ20లో బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో టీమిండియా బ్యాట్స్‌మెన్ పలు రికార్డులు నమోదు చేయగా.. విండీస్ జట్టు మాత్రం కొన్ని చెత్త రికార్డులను ఖాతాలో వేసుకుంది. అవేంటో చూద్దాం..
1. విరాట్ కోహ్లీ.. స్వదేశంలో టీ20 ఫార్మాట్‌లో 1000 పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా.. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మతో (2,633) సమంగా నిలిచాడు.
2. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు అందుకున్న రెండో క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ (15) నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ (19) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకూ జాక్వస్ కలిస్ (14)తో కలిసి రెండో స్థానంలో ఉన్న కోహ్లీ అతడిని దాటేశాడు.
3. రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (404) మూడో స్థానంలో ఉండగా.. క్రిస్ గేల్ (534), షాహిద్ అఫ్రీది (476) తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
4. ఒక టీ20 మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్లు(రోహిత్ , రాహుల్, కోహ్లీ).. 70 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం ఇదే తొలిసారి.
5. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో టీమిండియా ఓపెనర్లు ఇద్దరూ అర్ధశతకాలు బాదడం ఇది ఐదోసారి.
6. టీ20ల్లో భారత్‌కు ఇదే మూడో అత్యుత్తమ స్కోరు. ఇప్పటివరకూ.. 2017లో శ్రీలంకపై చేసిన 260 పరుగులే అత్యధికం.
7. ఈ సిరీస్ ఓటమితో.. అన్ని ఫార్మాట్లలో కలిపి విండీస్.. భారత్‌పై వరుసుగా ఏడు సిరీసులను కోల్పోయింది.
8. ఇదే కాకుండా.. విండీస్ మరో చెత్త రికార్డ్‌ను మూటగట్టుకుంది. టీ20ల్లో ఎక్కువ పరాజయాల్ని చవిచూసిన జట్టుగా శ్రీలంక (61)తో కలిసి మొదటిస్థానంలో నిలిచింది.