రిటైర్మెంట్ ప్రకటించిన స్వింగ్ కింగ్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Jan 2020 2:36 PM GMTటీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్ని ఫార్మాట్లకు సెలవు చెప్తూ శనివారం నాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007 టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఇర్ఫాన్ నిర్ణయం క్రికెట్ అబిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అయిన ఇర్ఫాన్ పఠాన్.. కపిల్ దేవ్ తర్వాత అంతటి ప్రమాదకర స్వింగ్, సీమ్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
ఈ సందర్బంగా.. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి నేను రిటైర్ అవుతున్నాను. దిగ్గజ ఆటగాళ్లైన గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్ వంటి వాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం నా అదృష్టం. ఇక వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చిందని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు. అలాగే.. నాకు మద్దతునిచ్చిన నా కుటుంబానికి.. నా అభిమానులకు కృతజ్ఞతలు. నేను మళ్లీ క్రికెట్ ఆడాలని వారంతా కోరుకున్నారు. వాళ్ల తోడ్పాటే నన్ను ముందుకు నడిపించిందని ఇర్ఫాన్ బావోద్వేగంగా అన్నాడు.
2007లో మొదటి టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా విజయంలో ఇర్ఫాన్ కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి.. కేవలం 16 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు, ఈ మ్యాచ్‌లో ఇర్ఫాన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా గెల్చుకున్నాడు.
35 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్.. భారత్ తరుపున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌ల్లో ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 301 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే బ్యాటింగ్‌లో ఓ సెంచరీ, 11 అర్థ సెంచరీలతో 2821 పరుగులు కూడా సాధించాడు. అలాగే.. ఇర్ఫాన్.. భారత్ తరపున టెస్టుల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన ముగ్గురు బౌలర్లలో ఒకడు. అంతేకాదు.. మ్యాచ్ మొదటి ఓవర్లోనే ఈ ఘనత సాధించిన మొదటి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.
2003లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా పఠాన్ అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించాడు. ఇక 2012లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ పఠాన్‌కు చివరిది. ప్రస్తుతం ఇర్ఫాన్ పఠాన్ జమ్ము- కశ్మీర్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.