మే 5 త‌రువాత ప‌రిస్థితి అదుపులోకి.. స్వామి స్వరూపానందేంద్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 April 2020 10:03 AM GMT
మే 5 త‌రువాత ప‌రిస్థితి అదుపులోకి.. స్వామి స్వరూపానందేంద్ర

కరోనా వైరస్ నియంత్రణపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా గురించి నైరాశ్యం చెంద‌వ‌ద్ద‌ని.. భారతదేశం ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎన్నో చూసిందన్నారు. ప్రస్తుతం కాలసర్పదోషం ప్రపంచాన్ని వెంటాడుతోందని, గ్రహ పరిస్థితుల కారణంగా కరోనా కంట్రోల్ కావడం లేదన్నారు. ఏప్రిల్ 24 నుంచి దుష్ట గ్రహాల ప్రభావం తగ్గుముఖం పడుతుందని, మే 5 తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. కరోనా వైరస్ ప్రమాదకరమే అయినా భగవంతుని కృపతో ఆ ప్రభావం తగ్గుతుంద‌ని తెలిపారు. జ్యోతిష్య శాస్త్రాన్ని పరిశీలిస్తే ఈ వైరస్ ప్రభావం సంవత్సరాల తరబడి ఉండదనిపిస్తోందని, కరోనా కారణంగా భారత దేశానికి అంతగా చేటు జరగదని పేర్కొన్నారు.

విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేస్తున్నామ‌ని, కరోనా ప్రభావాన్ని నివారించేందుకు జపాలు, హోమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించామ‌ని చెప్పారు. ప్రజలంతా భగవంతుడి రక్షణ కోరుకోవాల‌ని సూచించారు. ఈ సమయంలో భగవంతుని నామస్మరణే భారతదేశానికి రక్షణ అని, లాక్ డౌన్ సమయంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గ‌డ‌పాల‌ని, పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచాల‌ని స్వామి స్వరూపానందేంద్ర సూచించారు.

Next Story