కరోనా మహమ్మారిని పారద్రోలాలి అంటూ గోమూత్ర పార్టీ.. ఏమని పాటలు పాడారంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 March 2020 9:03 AM GMT
కరోనా మహమ్మారిని పారద్రోలాలి అంటూ గోమూత్ర పార్టీ.. ఏమని పాటలు పాడారంటే..?

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారిని అంతం చేసే మందులను తయారుచేయడానికి శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున రీసర్చ్ నిర్వహిస్తున్నారు. వివిధ దేశాల్లో దీనికి సంబంధించిన పరిశోధనలు ముమ్మరం చేస్తున్నారు. మన దేశంలో కరోనా వైరస్ ను పారద్రోలాలి అంటూ ఇప్పటికే యాగాలు చేస్తూ ఉన్నారు. గోమూత్రాన్ని తాగండి, పిడకలను కాల్చండి, గోమూత్రం పార్టీలో మీరు కూడా భాగస్వామ్యులు అవ్వండి, యాంటీ-కరోనా వైరస్ చాప మీద పడుకోండి అంటూ ఉచిత సలహాలు ఎక్కువయ్యాయి.

అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ ను పారద్రోలాలి అని అధికారులు, వైద్యులు పలు సూచలను చేస్తూ ఉంటే కొందరు నాయకులు మాత్రం తమకు తోచిన చిట్కాలను చెబుతూ ఉన్నారు. ఓ వైపు శాస్త్రవేత్తలు కోవిద్-19 కు సంబంధించిన క్యూర్ ను వెదకడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుండగా కొన్ని పార్టీలు, దేశంలో పెద్ద పార్టీకి చెందిన అనుబంధ సంస్థలు మాత్రం కరోనా వైరస్ 'మాంసాహారుల మీద కోపంతో పుట్టుకొచ్చిన నెగెటివ్ ఎనర్జీ' అంటూ చెప్పుకొచ్చారు. కరోనాను శాంతిపజేయాలంటే గోమూత్రాన్ని తాగాలని, పిడకలను కాల్చాలని, కొన్ని కార్యక్రమాలను నిర్వహించి శాంతిపజేయాలని చెబుతున్నారు.

ఇక భారతదేశ రాజధాని ఢిల్లీలో శనివారం నాడు 'గోమూత్ర పార్టీ' ని నిర్వహించారు. వైరస్ ను అంతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమట. అఖిల భారతీయ హిందూ మహా సభ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ చక్రపాణి మహారాజ్ ఈ పార్టీని మధ్యాహ్నం పూట ఏర్పాటు చేశారు. గోమాంసం తిన్నందు వల్లే కేరళలో వరదలు సంభవించాయన్నారు. గోమూత్రం తాగితే కరోనా దరిచేరదని అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ‘గోమూత్ర పార్టీ’లను మరిన్ని నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచుతామని చక్రపాణి మహారాజ్ వ్యాఖ్యలు చేశారు. 'గోమాత కు జై' అంటూ అక్కడికి వచ్చిన పార్టీ సభ్యులు ఆనందంలో మునిగిపోతూ మట్టితో చేసిన కప్పుల్లో గోమూత్రాన్ని పోసుకుని తాగారు.

'వాహ్.. మజా ఆ గయా' అంటూ అందరూ థలా ఓ గ్లాసు గోమూత్రాన్ని తాగారు. కరోనా వైరస్ ఓ హిందూ దైవం అనీ.. మాంసాహారులను శిక్షించడానికి పుట్టుకొచ్చిన కోపోద్రిక్తమైన రూపం అని.. ఆయన్ను శాంతింపజేయాలంటే పూరీలు, ఖీర్(పాయసం) సమర్పించాలని సూచించింది అఖిల భారతీయ హిందూ మహా సభ పార్టీ సభ్యులే. ప్రభుత్వం ఆల్కహాల్ స్థానంలో గోమూత్రాన్ని ప్రవేశపెట్టాలని, ఎయిర్ పోర్టుల్లోని డ్యూటీ-ఫ్రీ రీటైల్ స్టోర్స్ లో గోమూత్రాన్ని అమ్మాలని సూచించారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలను పట్టించుకోకుండా దేశీ గోవులు వేసే పేడ ద్వారా కరోనా వైరస్ ను అంతం చేయొచ్చంటూ వీడియోలను యుట్యూబ్ లో పెట్టారు. అలాగే దేశీ గోవుల నెయ్యితో యజ్ఞాలు నిర్వహించాలని.. ఇళ్లల్లో నేతితో దీపాలు వెలిగించాలని సూచించారు. వీటితో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడమే కాకుండా కరోనా వైరస్ కూడా దరిచేరదని వారు సూచించారు.

ప్రభుత్వం ఎక్కువ మంది ఓ చోట కలిసి ఉండకూడదంటూ సూచనలు చేసినా కూడా వీరు పట్టించుకోకుండా గోమూత్ర పార్టీని నిర్వహించారు. ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఓ మహిళ 'కరోనా భాగ్ జా'(కరోనా పారిపో) అంటూ పాట పాడడం కూడా విశేషం.

Next Story