రూ.156 కోట్ల స్వధాత్రి ఇన్ ఫ్రా స్కాం.. ముగ్గురి అరెస్ట్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2020 2:15 PM GMT
రూ.156 కోట్ల స్వధాత్రి ఇన్ ఫ్రా స్కాం.. ముగ్గురి అరెస్ట్‌

స్వధాత్రి రియల్ ఎస్టేట్ కంపెనీ స్కాంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో భూములను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం సైబరాబాద్‌ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ వెల్లడించారు. నగరానికి చెందిన యార్లగడ్డ రఘు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో అధిక వడ్డీ ఇస్తానంటూ పలువురిని మోసం చేశారని సజ్జనార్‌ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 3వేల మంది బాధితులు ఉన్నారన్నారు. ఇప్పటి వరకు రూ.156 కోట్ల స్కాం జరిగిందన్నారు.

అధిక వడ్డీ ఆశ చూపి ఏజెంట్లను నియమించుకుని.. ప్రజల నుంచి కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు తెలిపారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ తీరుగానే రియల్ ఎస్టేట్ దందా కొనసాగిందన్నారు. ఒక్క ఏజెంట్ ముగ్గురిని చేర్చితే అధిక మొత్తంలో యార్లగడ్డ రఘు కమీషన్లు ఇచ్చారని అన్నారు. స్వధాత్రి ఇన్ ఫ్రా పేరుతో ఘరానా మోసం జరిగిందని సీపీ సజ్జనార్ తెలిపారు. రఘు, శ్రీనివాస్, మీనాక్షిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు.

రియల్ ఎస్టేట్‌ లో ప్లాట్లు బుక్ చేసుకునేవారు ఎవరో ముందుగానే తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని సూచించారు. మార్కెట్ ఏజెన్సీకి సంబంధించి వివరాలను ధ్రువీకరించుకోవాలన్నారు. ఇన్ ఫ్రా నిర్మించేవాళ్లు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి స్కీమ్‌లను ప్రజలు ఎవరూ నమ్మొద్దని, ముందుగా వెరిఫై చేసుకోవాలన్నారు.

ఎవరో వచ్చి ప్లాట్ అమ్ముతున్నారంటే ఏజెంట్లు ఎలా నమ్ముతారని ఆయన అడిగారు. వచ్చే ఆదాయం తగ్గి ఇచ్చేది ఎక్కువైతే దుకాణం మూసేస్తారని ఆయన అన్నారు. ఎంత మంది ప్లాట్స్‌ బుక్‌ చేసుకున్నారు. ఎంత మంది డబ్బులు వాపసు ఇచ్చారు అనేది చూడాల్సి ఉందన్నారు.

Next Story