సుశాంత్ పై బెంగతో ఫడ్జ్ చనిపోయిందా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Jun 2020 12:23 PM GMT
సుశాంత్ పై బెంగతో ఫడ్జ్ చనిపోయిందా.?

ధోనీ.. ది అన్ టోల్డ్ స్టోరీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇటీవలే తీవ్ర మనోవేదనకు గురై బలవన్మరణానికి గురైన సంగతి తెలిసిందే. ఆ బాధ నుంచి కోలుకోకుండానే..సుశాంత్ చనిపోయిన ఒక్కరోజు వ్యవధిలోనే అతనికి దగ్గరి బంధువు కూడా మృతి చెందడంతో సుశాంత్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సుశాంత్ స్నేహితులు సైతం ఇక అతడు జీవించి లేడన్న నిజాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

సుశాంత్ కు తన గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిందని తెలుసుకున్న పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కానీ విచారణలో ఆమె ఏమి చెప్పిందన్న విషయాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అలాగే సుశాంత్ ఆత్మహత్య చేసుకునేందుకు సల్మానే కారణమంటూ కొందరు నెటిజన్లు అతడిని ట్రోల్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. అసలు సుశాంత్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన సంఘటనలు గానీ, కారణాలు గానీ ఇంతవరకూ ఖచ్చితంగా తెలియలేదు.

ప్రస్తుతం సుశాంత్ ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు శునకం ఫడ్జ్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. సుశాంత్ పై బెంగతో ఫడ్జ్ ఆహారం తినడం మానేసి, అనారోగ్యంతో మృతి చెందిందన్న వార్త నెటిజన్ల కంటపడింది. అంతే..ఇప్పుడు ఇది పెద్ద వైరల్ న్యూస్ గా మారింది. నిజంగానే ఫడ్జ్ చనిపోయిందా ? అని కొంత మంది నెటిజన్లు సుశాంత్ సన్నిహితులు, కుటుంబ సభ్యుల్ని అడుగగా అసలు విషయం తెలిసింది.

S1

S2

ఫడ్జ్ సుశాంత్ పై బెంగపెట్టుకుని ఆహారం తినడం మానేసి, దిగాలుగా ఉండటం నిజమే. మేం ఎవరం పిలిచినా అది పలకడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఫడ్జ్ చనిపోయిందన్న విషయం మాత్రం అవాస్తవమని ఖండించారు. ప్రస్తుతం ఫడ్జ్ చాలా బాగుందని, ఆరోగ్యంగానే ఉందని చెప్పుకొచ్చారు సన్నిహితులు.

Next Story